Restoration Work Falaknuma Step Well : హైదరాబాద్‌లో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణకు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి మెట్ల బావి ఫలక్‌నుమా బస్ డిపోలో ఉన్న విషయం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా గత నెల 3న.. ఇందుకు భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేశ్‌తో కలిసి అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావిని.. నిజాం తన వ్యక్తిగత ఈత కొలనుగా వాడేవారని తెలుస్తోంది. ఈ మేరకు దీని పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ , జీహెచ్ఎంసీ, సాహీ అనే ఎన్జీవో సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ షేక్ మీరా, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవోర్ జాయింట్ సెక్రెటరీ కల్పనా రమేశ్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం వినయ్ భాను, ఫలక్‌నూమా డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్, హెచ్ఎండీఏ డీఏవోలు ఎం. బద్రీనాథ్, అరుణ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్ మెట్ల బావి పునరుద్ధరణ: గతంలోనూ బన్సీలాల్‌పేట్‌లో 3 శతాబ్దాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్ల బావిని.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిసి పునరద్ధరించారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించగా.. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయింది. దీంతోసహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్లబావి పూర్వవైభవానికి చర్యలు చేపట్టింది.