నిత్యం వచ్చేపోయే వారితో సందడిగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు భయం నీడలో పనిచేస్తున్నాయి. అత్యవసర, తప్పనిసరి పనుల కోసం కొందరు వస్తూనే ఉన్నారు. తహసీల్దార్, పురపాలక సంఘాలు, ఎంపీడీఓ కార్యాలయాలకు సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ ఉంటోంది. భూవివాదాలు, భూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పదుల సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాలకు జనం వస్తూనే ఉన్నారు.
తహసీల్దార్లకే తాకిడి
భూవివాదాలు, రైతుబంధు నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. రెవెన్యూ అధికారులు దగ్గరలోని వీఆర్వోల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వీఆర్వోలు విధిగా గ్రామాల్లో ఉండాలని.. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌లు సూచిస్తున్నారు. భూవివాదాలు, భూముల సర్వేలకు సంబంధించిన సమస్యలపైనే ఎక్కువమంది రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్నారు.అయితే క్షేత్రస్థాయికి వెళ్లి ఆ పనులు చేసేందుకు సర్వే అధికారులు జంకుతున్నారు. సాధారణంగానే భూముల సర్వే అంశంలో తీవ్ర జాప్యం జరిగేది. తాజా పరిస్థితుల వల్ల జాప్యం మరింత పెరిగింది.
పాజిటివ్ వస్తే అందోళన..
ఉద్యోగుల్లో ఎవరికైనా కరోనా సోకితే మిగిలినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో సిబ్బంది అందరికీ పరీక్షలు చేస్తున్నారు. కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. శానిటైజేషన్ సహా వివిధ జాగ్రత్తల అనంతరమే తెరుస్తున్నారు. దీనివల్ల కూడా వివిధ సేవలకు అంతరాయం కలుగుతోంది. సంగారెడ్డి పురపాలకశాఖలోని ఒక విభాగాన్ని ఇలా 10 రోజులకు పైగా మూసేశారు. పరిస్థితి తీవ్రమైతే సెలవులు పెట్టడం తప్ప వేరే మార్గంలేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
ఒత్తిడి చేస్తే సెలవు పెట్టేస్తున్నారు
అత్యవసరమైతే తప్ప కార్యాలయాలకు రావద్దని సూచిస్తున్నా ప్రజలు వస్తూనే ఉన్నారని కరీంనగర్ జిల్లాకు చెందిన తహసీల్దార్ ఒకరు తెలిపారు. ఉద్యోగులు తీవ్ర భయాందోళనలతో పనిచేస్తున్నారని.. గట్టిగా ఒత్తిడి చేస్తే సెలవు పెట్టి వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తిచేయడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
కిటికీ నుంచే సేవలు
పెద్దపల్లి జిల్లాలోని రెవెన్యూశాఖలో కీలకమైన ఒక అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంతకుముందు వరకూ ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలపై దృష్టి సారించిన రెవెన్యూ అధికారులు ఈ తర్వాతి నుంచి ప్రజల్ని కలవడానికి జంకుతున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం మూసేశారు. కిటికీని మాత్రం తెరిచి లోపల రెండు అట్టపెట్టెలను పెట్టారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని ఆ పెట్టెల్లో వినతిపత్రాలను వేసి వెళ్లాలని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యం
ప్రజలు రెవెన్యూ, పురపాలక కార్యాలయాల్లో సేవలకు పూర్తిగా మీ-సేవ లేదా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నా.. వెంటనే పని పూర్తి చేయించుకోవడం కోసమని కార్యాలయాల బాట పడుతున్నారు. పురపాలక కమిషనర్లు ఎక్కువమంది ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్, గృహ నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్ తదితర పనులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా సాగుతున్నాయి. అయినా కొందరు ప్రజలు కార్యాలయాలకు వచ్చి వెళుతున్నారు.
పెట్టెలో వేసి వెళ్లండి
అన్ని కార్యాలయాల్లోనూ ప్రజావాణి రద్దయ్యింది. సందర్శకుల నుంచి వినతిపత్రాలు మాత్రమే తీసుకుంటున్నారు. చాలా కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటు చేసి వినతులను వాటిలో వేసి వెళ్లాలని సూచిస్తున్నారు. తర్వాత వాటిని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నారు. అత్యవసరమైనవి ఉంటే మాత్రం అందుబాటులో ఉన్న సిబ్బందికి చెప్పాలని కోరుతున్నారు.