Millets Products: రాష్ట్రంలో చిరుధాన్యాల విప్లవం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంటలజీవవైవిధ్యం,పర్యావరణ హితం దృష్ట్యా పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేలా రైతుల్నిప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. పట్టణాలు, నగరాల్లో మంచి నాణ్యమైన చిరుధాన్యాల లభ్యతతోపాటు అదనపు విలువ జోడింపు, రుచికరమైన వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే రైతుల ప్రయోజనాల దృష్ట్యా నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర పనిముట్లు సరఫరా చేస్తున్న ఆగ్రో సేవా కేంద్రాల్ని అందులో భాగస్వామం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్ధులకు రుచికర సాత్విక ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వంతో అక్షయ ఫౌండేషన్, హరే కృష్ణ మూవ్‌మెంట్ పదేళ్లుగా భాగస్వామ్యమై సేవలు అందిస్తోంది. జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ పేరిట 5 రూపాయలకే భోజనం సరఫరా చేస్తోంది.
"మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రభుత్వంతో కలిసి మా సంస్థ తయారుచేస్తోంది. ఈ మధ్య కాలంలో యువత ఆ మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మానేశారు. అందుకే ముఖ్యంగా యువత, చిన్నపిల్లలను ఆకార్షితులు చేయడానికి రాగితో తయారు చేసిన ప్రత్యేక వంటకాలు, మోడ్రన్‌గా కేక్‌లు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాం". -సత్యగౌరచంద్ర దాస్, హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు
స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలిసి వనపర్తిలో తొలిసారిగా ఐసీడీఎస్ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిహాకారం కోసం ప్రయోగాత్మకంగా చిక్కీలను అందిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఉత్పత్తులను గ్రామీణప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల వద్ద సేకరించి చిరుధాన్యాలకు పూర్వవైభవం తేవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో గ్రామాల్లో రైతులకు సేవలందిస్తున్న ఆగ్రో సేవా కేంద్రాల నిర్వాహకులకు ఇతోధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ఎస్బీఐ అధికారులు తెలిపారు.