Cabinet Subcommittee meeting : ఆదాయవనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మరోదఫా సమావేశమైంది. ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కోత, ఆంక్షల నేపథ్యంలో.. ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది.
Source of Revenue for TS : ఇటీవల శాసనసభ వేదికగా కూడా మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, వాటి పురోగతి, వచ్చిన ఆదాయం గురించి మంత్రులు ఆరా తీశారు. ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎక్సైజ్, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ఆదాయం, పరిస్థితులను అధికారులు సమావేశంలో వివరించారు.
నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయం: నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయం, పురోగతిని తెలుసుకున్నారు. బాహ్య వలయ రహదారి టోల్‌కు సంబంధింటి టీఓటీ పద్ధతి అమలుపై చర్చించారు. రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం పురోగతిని సమీక్షించారు. వేలం పూర్తైనప్పటికీ సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు పూర్తి కానందున ప్రభుత్వానికి ఇంకా డబ్బు అందలేదు. ఇబ్బందులను అధిగమించి రిజిస్ట్రేషన్ల ప్రక్రకియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.