ప్రభుత్వ నిర్వాకం వల్లే వారం రోజుల వ్యవధిలో ఇద్దరు నిరుపేద రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా.. పేద రైతులకు న్యాయం జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పక్షాన పదే పదే ఈ విషయాలను చెప్పినా.. పాలకులు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు.
వారే అవినీతికి పాల్పడుతున్నారు..
రెవెన్యూ ప్రక్షాళన అదునుగా తీసుకుంటూ ఆ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. చేవెళ్ల నియోజకవర్గం పామేల్ గ్రామంలోని ఎస్సీ రైతు అంతయ్య ఈ నెల 17న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో రైతు పెద్దపల్లి జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి రెవెన్యూ అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.