Corona effect in gurukul school: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో కరోనా లక్షణాలున్న విద్యార్థులను గుర్తించి సత్వర వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి తరగతి గదిలో చురుకైన విద్యార్థిని గుర్తించి ‘చిన్నారి డాక్టర్’గా ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. పాఠశాల ప్రిన్సిపల్, సైన్స్ టీచర్, పీఈటీ, స్టాఫ్‌నర్సుతో కలసి ‘కొవిడ్ వారియర్’ గ్రూపు ఏర్పాటు చేస్తోంది. గురుకులాల్లో ఇటీవల కరోనా కేసులు నమోదు కావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని గురుకులాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఈఎంఆర్‌ఎస్ సొసైటీల పరిధిలో నెల రోజులుగా 106 మంది విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయా విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రత్యేకంగా సొసైటీల కోసం ఏర్పాటుచేసిన ఆరోగ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ ‘పనేషియా’ను సంప్రదించారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) పరిధిలో వైద్యం అందించడంతో 22 మంది కోలుకున్నారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు.
సత్వర గుర్తింపు కష్టసాధ్యం..
గురుకులాల్లో కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న విద్యార్థులను వెంటనే గుర్తించడం కష్టమవుతోంది. కొందరు జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నా తోటివిద్యార్థులు భయపడతారని, తమను దూరం పెడతారని గుట్టు చెప్పడం లేదు. ఇటీవల సంగారెడ్డి బీసీ గురుకులంలో 48 మంది విద్యార్థులకు కరోనా తేలడంతో ఆయా గురుకుల సొసైటీలు అప్రమత్తమయ్యాయి. లక్షణాలు కనిపించిన వెంటనే పాఠశాల స్టాఫ్‌నర్సును సంప్రదించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ‘చిన్నారి డాక్టర్’లను నియమిస్తున్నాయి. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఈఎంఆర్‌ఎస్ గురుకుల సొసైటీల్లో ఈ నియామకాలు కొనసాగుతున్నాయి. తద్వారా పాజిటివ్‌గా తేలిన విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తున్నాయి. విద్యార్థులను గురుకులంలోనే ఐసొలేషన్‌లో ఉంచి, క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి.
కమాండ్ కంట్రోల్‌ను వీడిన బీసీ సొసైటీ
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, సకాలంలో వైద్యసేవలు అందించేందుకు గురుకుల సొసైటీల పరిధిలో ‘పనేషియా’ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటైంది. విద్యార్థులు జబ్బుపడినట్లు గుర్తించిన వెంటనే దాన్ని సంప్రదిస్తే.. అక్కడి వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ ఏడాది పనేషియా నుంచి బీసీ గురుకులం వైదొలగింది. దాని అవసరం లేదంటూ బీసీ సంక్షేమశాఖ నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా బీసీ గురుకుల విద్యార్థుల ఆరోగ్య సమాచారం అందుబాటులో లేకుండా పోయింది.
ఇదీ చదవండి:cabinet subcommittee on corona: 'నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ'