కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని డిజిటల్ మార్గాలవైపు దారిమరల్చింది. అన్ని పనులను ఆన్లైన్లో చక్కబెట్టే మనం.. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఎన్నికల్లో సైతం మొబైల్ ద్వారా ఓటింగ్ వేసే పద్ధతిని(e voting) త్వరలోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఐటీఅండ్ సీ విభాగం, సీడాక్ కలిసి సంయుక్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్షన్ విధానాన్ని రూపొందించాయి. ఐఐటీ బిలాయి డైరెక్టర్ రాజత్ మూనా అధ్యక్షతన నిపుణుల కమిటీ మార్గదర్శకంలో ఈ ప్రాజెక్టును పరీక్షిస్తున్నారు.
మొదటగా వారికే అవకాశం
మొదటగా ఈ-వోటింగ్ విధానాన్ని కొన్ని గ్రూపుల ప్రజల కొరకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాజెక్టుకు అంకురార్పన చేసింది. ఇందులో ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, పోలింగ్ సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, నోటిఫైడ్ ఎసన్షియల్ సర్వీసు ఉద్యోగులకు ఈ విధానంలో ఓటుహక్కు కల్పించనున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగంతో, సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ -సీడాక్తో జతకట్టింది.
ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా..
మొబైల్ ఆధారంగా ఈ-వోటింగ్ చేసే సాంకేతికత అభివృద్ధి ఇప్పటికే పూర్తవగా.. ఇందుకు సంబంధించిన డ్రైరన్‌ను ఒక డమ్మీ ఎలక్షన్ నిర్వహించటం ద్వారా పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాను పైలెట్‌గా ఎంచుకొని అక్టోబర్ 8 నుంచి 18 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. అక్టోబర్ 20న డమ్మీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ డ్రైరన్‌లో పాల్గొనేందుకు జిల్లాలోని అందరు పౌరులకు అవకాశం ఇవ్వనున్నారు.