Government Focus on Pending Bills Payment Fundraising : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి సారించింది. అన్నీ కలిపి మొత్తం 4 లక్షల 78 వేల 168 బిల్లులు ఖజానాల్లో పెండింగ్లో ఉండగా, వీటికి రూ.40,154 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో వీటిలో కొన్ని ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ తాజాగా నివేదించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో వీటన్నింటినీ ఇప్పటికిప్పుడు చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో నిధుల సమీకరణ మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలిస్తే అదనంగా రుణాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. ఇదే సమయంలో అసలు 4.78 లక్షల బిల్లులు సుదీర్ఘ కాలంగా ఎందుకు పెండింగ్లో ఉన్నాయన్న అంశంపైనా శాఖల వారీగా సర్కారు వివరాలు సేకరిస్తోంది.
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!
మూడో త్రైమాసికానివీ ఇవ్వలేదు : మామూలుగా ప్రతి ఆర్థిక ఏడాదిలో ప్రతి త్రైమాసికానికి బడ్జెట్ కేటాయింపుల ప్రకారం అన్ని శాఖలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు తొలి విడత, జులై మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు రెండో విడత, అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ వరకు మూడో విడత, జనవరి నుంచి మార్చి నెల వరకు నాలుగో విడత నిధులు విడుదల చేస్తూ అన్ని శాఖలకు ఆర్థిక శాఖ 'బీఆర్వో' (బడ్జెట్ రిలీజ్ ఆర్డర్) జారీ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం (2023-2024) అసెంబ్లీ ఎలక్షన్స్ కారణంగా చాలా శాఖలకు మూడో త్రైమాసికం నిధులూ విడుదల చేయలేదు. అంతకుముందు రెండు త్రైమాసికాల్లోనూ కొన్ని ఎంపిక చేసిన శాఖలకే బడ్జెట్ విడుదలైనట్లు తేలింది.
గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డుల కోసం 28 నుంచి దరఖాస్తులు!
అన్నింటికీ బడ్జెట్ విడుదల చేయకపోవడంతో కొన్ని శాఖలు ఖజానాకు సమర్పించిన బిల్లుల్లో ఐదారు నెలల నుంచి అసలు చెల్లింపులే జరగనివి కూడా కొన్ని ఉన్నట్లు సమాచారం. వీటిల్లో ప్రభుత్వ ఉద్యోగుల పర్సనల్ బిల్లులే రూ.1000 కోట్లకు పైగా పెండింగులో ఉన్నాయి. ఇక పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సిన రాయితీ (సబ్సిడీ) నిధుల కోసం ప్రజలు సమర్పించిన బిల్లులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పలు అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ కాంట్రాక్టర్లు మొత్తం 10,169 బిల్లులు పెట్టగా, వీటికి చెల్లించాల్సిన రూ.10 వేల 498 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.