పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... అటవీ పునరుద్ధరణ చర్యలు సహా వివిధ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. పట్టణప్రాంత పరిసరాల్లో ఉన్న ఆటవీ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసే చర్యలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 129 ప్రాంతాల్లో లక్షా 60 వేల ఎకరాల విస్తీర్ణంలో 188 అటవీ బ్లాకులు ఉన్నాయి. అందులో పట్టణప్రాంతాల సమీపంలో ఉన్న 95 పార్కుల పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టి అందులో 32 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
అర్బన్ ఫారెస్ట్ పార్కులకు విశేష స్పందన
మిగతా చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆయా అటవీ బ్లాకుల్లో ఆటవీ పునరుద్ధణ చర్యలు చేపట్టడంతో పాటు నేల-తేమ పరిరక్షణ చర్యలు, రూట్ స్టాక్ అభివృద్ధి, నేలల స్వభావానికి అనుగుణంగా మొక్కలు నాటడం, ఆహ్లాదాన్ని, నీడను ఇచ్చే మొక్కలు నాటడం, సందర్శకులకు సౌకర్యాలు, పిల్లలు ఆదుకునేందుకు ఏర్పాట్లు... తదితర పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అర్బన్ ఫారెస్ట్ పార్కులను మరింత బాగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖాలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేసి అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.