తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ.. నివేదికలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు

House Plots Distribution : అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించనున్న సర్కార్.. స్థలం లేని వారికి పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వెయ్యి ఎకరాలకు పైగా భూమిని గుర్తించారు. కలెక్టర్ల నుంచి సమగ్ర వివరాలు అందిన తర్వాత ఈ విషయమై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Double bed room house
Double bed room house

By

Published : Mar 25, 2023, 8:23 AM IST

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు

House Plots Distribution : పేదల కోసం రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణ పథకాన్ని కొనసాగిస్తూనే.. సొంత స్థలాలు ఉన్న వారు గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా ఆర్థికసాయం అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గృహలక్ష్మి పేరిట ఒక్కో ఇంటి నిర్మాణానికి దశల వారీగా రూ. 3 లక్షలను ప్రభుత్వం గ్రాంటుగా అందించనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి సర్కార్ ఆర్థిక సాయం అందించనుంది.

అయితే సొంత స్థలాలు లేని వారికి కూడా లబ్ధి కలిగించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టాల పంపిణీకి సిద్దమవుతోంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు చర్చించింది. పేదలకు పట్టాల పంపిణీకి అనువైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లు, అధికారులను గతంలోనే ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పేదలకు నివాస స్థలాల పంపిణీకి రాష్ట్రంలో గుర్తించిన వెయ్యి 39 ఎకరాల భూములకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Grulahakshmi Scheme: ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. నిరుపేదలకు లబ్ది కలిగే 58, 59, 76,118 జీవోలపై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి, క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాల నుంచి సమగ్ర సమాచారం వచ్చాక ఇండ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం విధానపర నిర్ణయాన్ని ప్రకటించనుంది. క్రమబద్దీకరణ సహా గ్రామ కంఠం తదితర సమస్యల పరిష్కారంపై కూడా కసరత్తు జరుగుతోంది. మొత్తంగా అన్ని రకాలుగా కోటి కుటుంబాలకు లబ్ది చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

రూ.4 వేల కోట్ల రుణాలు మాఫీ: ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు రుణంగా ఇచ్చిన రూ.4 వేల కోట్ల రుణాల మొత్తాన్ని మాఫీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేయాలని పేర్కొంది.

ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు కొనసాగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 58, 59 ఉత్తర్వుల కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2020 వరకు పొడిగించడంతో పాటు దరఖాస్తుకు మరో నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ప్రభుత్వానికి 'డబుల్​' తలనొప్పి.. ఇళ్లు వేలల్లో.. ఆశావహులు లక్షల్లో..!

డబుల్‌ ఇళ్ల పేరిట బురిడీ.. రూ.5 లక్షలిస్తే పట్టా రెడీ అంటూ..

ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి జైలుకు వెళ్లాల్సిందే: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details