రాష్ట్రవ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్ నిలిపివేత - వ్యాక్సినేషన్ తాజా వార్తలు
21:14 April 17
రాష్ట్రవ్యాప్తంగా రేపు వ్యాక్సినేషన్ నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నుంచి మళ్లీ యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు లేకపోవటం, ఆదివారం సాయంత్రానికి గాని కొత్త డోసులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 30లక్షల డోసులు పంపాలని కోరగా గతంలో కేవలం 4.6లక్షలు మాత్రమే వచ్చాయి. ఆదివారం మరో 2.6 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రానికి ఇప్పటి 31,38,990 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. అందులో శుక్రవారం నాటికి 28,97,90 వ్యాక్సిన్ డోసులను వినియోగించారు. అందులో 40,540 డోసులు ఆర్మీకి అందజేశారు. మరో 1.22శాతం వ్యాక్సిన్ వృథా అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకా కోసం బారులు తీరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 65శాతం హెల్త్ కేర్ వర్కర్లు, 63శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లు, 25శాతం 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. గడచిన ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 6,36,117 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. శుక్రవారం రికార్డు స్థాయిలో 1,468 కేంద్రాల ద్వారా 1,68, 383 మందికి టీకాలు అందించారు.