మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 61 రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో మరో 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అత్యధికంగా ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు లభ్యమవుతుండగా.. నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలకూ ఈ సేవలను విస్తరించారు. కొత్తగా మంజూరు చేసిన సెంటర్లలో తొలుత ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఒక్కో దాంట్లో 5 డయాలసిస్ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. అవి.. 1. కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి(నాగార్జునసాగర్) 2. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి(సిద్దిపేట), 3. హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రం(సిద్దిపేట) 4. ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి(జగిత్యాల) 5. షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం(రంగారెడ్డి)ల్లో త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి ఆదేశాలిస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ వైద్యంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలుండగా.. వీటి సంఖ్య గత ఏడేళ్లలో 45కు పెరిగింది.
10వేల మందికి పైగా బాధితులకు లబ్ధి..