రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కారణంగా బాధితుల ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆక్సిజన్, ఐసీయూ పడకలపై చికిత్సలు జరుగుతున్నాయి. గడచిన ఐదు రోజులుగా కరోనా పాజిటివ్ రేటు దాదాపు పది శాతం చేరువలో నమోదవుతోంది. బాధితుల సంఖ్య పెరగడంతో అత్యవసర వైద్యానికి డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్ పడకలు వేగంగా నిండుతున్నాయి.
పడకల సంఖ్యను పెంచి..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, టిమ్స్‌లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు స్వల్ప సంఖ్యలో మినహా మిగతా ఆసుపత్రుల్లో వాటి లభ్యత కష్టమవుతోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోనూ పడకలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడంతో పాటు మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులను కరోనా వైద్యం పరిధిలోకి తెస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 108 ప్రభుత్వ, 1032 ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సను అందిస్తున్నాయి. వాటిలో ఇపుడు 27,759 ఆక్సిజన్, ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా 17,761 భర్తీ అయ్యాయి. అంటే దాదాపు 64 శాతం ఆక్యుపెన్సీ ఉంది.