Swapnalok Complex Fire Accident In Secunderabad: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు పలువురు గాయపడటంపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సఅందించాలని.. అధికారులను సీఎం ఆదేశించారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు.. ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిందన్న తలసాని.. సర్కారు తరఫున అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది: జంటనగరాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. స్వప్నలోక్‌కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఆయన.. ఆరుగురు మృతిచెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత దుర్మరణం పాలవటం బాధాకరమన్నారు. సికింద్రాబాద్‌లో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన విచారణ, నివారణ చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించిందన్నారు.
విశ్వనగరమని కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు:విశ్వనగరమని కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ప్రజలకు కనీస భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి భవిష్యత్ ఇలాంటివి జరవగకుండా చర్యలుచేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వప్నలోక్‌ను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్.. అగ్నిప్రమాదంలో 6 మంది యువతీ యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు.