తెలంగాణాలో భూములకు కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి తెచ్చేందుకు పదిరోజులే గడువు ఉండటంతో ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు ప్రాతిపదికగా ఉండే మార్కెట్ విలువలను డిమాండ్, ప్రాంతాల వారీగా వినూత్న విధానానికి శ్రీకారం చుడుతున్నారు. బాగా విలువ ఉండి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువలను ప్రత్యేకంగా నిర్ణయించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు భారీ డిమాండ్ కొనసాగుతుండటంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న విలువ, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు మధ్య భారీ అంతరం ఉండటంతో దీన్ని హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పెరిగిన రాబడి
వ్యవసాయ భూముల విలువ ప్రస్తుతం ఉన్నదానికంటే 50 శాతం, ఖాళీ స్థలాల మార్కెట్ విలువ 35 శాతం, అపార్ట్మెంట్ల ఫ్లాట్ల విలువ 25 శాతం పెంచేలా కసరత్తు జరుగుతోంది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువను ప్రత్యేకంగా గుర్తించి 40 శాతం పైగా పెంచనున్నారని విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో 2013 లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలను సవరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి సారిగా 2021 జులైలో మార్కెట్ విలువలను సవరించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ఏటా సుమారు రూ.3000 కోట్ల నుంచి రూ.3500 కోట్ల వరకు అదనపు రాబడిని అంచనా వేసింది. గత ఎనిమిది నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రాబడి పెరిగింది.
మార్కెట్ ధరలు కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్యే తొమ్మిది లక్షలు దాటింది. ఏడేళ్ల తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెంచిన వాస్తవంగా ఉన్న బహిరంగ మార్కెట్ ధరలకు పొంతనలేదని గుర్తించింది. దీంతో రిజిస్ట్రేషన్‌కు ప్రాతిపదికగా ఉండే మార్కెట్ విలువల్లో మరింత హేతుబద్ధత ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ప్రభుత్వం హెచ్ఎండీఏ ద్వారా భూములను విక్రయించినపుడు పలికిన ధరలతో పాటు భారీగా పెరిగిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ నేపథ్యంలో ప్రభుత్వ మార్కెట్ ధరలు కీలకంగా భావిస్తోంది.