తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వల ఉత్పత్తి హబ్​గా మార్చేందుకు సర్కారు ముందడుగేసింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగం 2020-30కి సంబంధించి విధాన ప్రకటన చేసింది. ఇందులో వినియోగదారులు, తయారీదారులను ఆకర్షించేందుకు ప్రోత్సహకాలు అందించనున్నట్లు పేర్కొంది. వాహనదారులకు ఛార్జింగ్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించే శిఖరాగ్ర సదస్సులో 10.30గంటలకు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పాలసీని ఆవిష్కరించనున్నారు.

government announces electric vehicle policy for 2020-30 in telangana
ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

By

Published : Oct 30, 2020, 5:13 AM IST

ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో నూతన విధానం

భారత్‌లో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంతోపాటు... వినియోగాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రకటించింది. 2020 నుంచి 2030 వరకు పదేళ్ల పాటు ఈ విధానాలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే వీటిని పొడిగించడంతోపాటు మార్పులు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

భారీ ప్రోత్సాహకాలు..

రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో పాలసీని రూపొందించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించటానికి... తయారీ దారులు, వినియోదారులకు ప్రోత్సాహాకాలను సైతం ప్రకటించారు. 200 కోట్లకు మించి పెట్టుబడి పెట్టినా.... వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తారు. అలాంటి వాటికి పెట్టుబడి మొత్తంలో దాదాపు 20 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఏడాదికి అత్యధికంగా 5కోట్ల వరకు ఎస్జీఎస్టీని తిరిగి చెల్లించటంతోపాటు.. మొదటి ఐదేళ్లు... 25శాతం విద్యుత్ ఛార్జీలు తగ్గింపు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఫీజులపై వందశాతం రీ ఎంబర్స్‌మెంట్ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మొదటి 2లక్షల వాహనాలకు...

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలోనే కొని, రిజిస్ట్రేషన్ చేయించుకునే మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, 20 వేల ఆటో రిక్షాలు, 5వేల ఫోర్ వీలర్‌లు, 10 వేల లైట్ గూడ్స్ , క్యారియర్‌లకు పూర్తిగా రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రాక్టర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రైవేటు వాహనాలతో పాటు... ప్రజా రవాణాలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పార్కింగ్​, ఛార్జింగ్​ సమస్యలకు పరిష్కారాలు

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ప్రధానంగా పార్కింగ్, ఛార్జింగ్ సమస్యలకు కూడా ఉత్తర్వుల్లో పరిష్కారాలు చూపింది. ప్రాథమికంగా ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో... ఛార్జింగ్ కోసం ప్రత్యేక రుసుములను నిర్ణయిస్తామని వివరించింది. ఎయిర్ పోర్ట్ , రైల్వే స్టేషన్, బస్ డిపో వంటి ప్రాంతాల్లో పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. వెయ్యి అంతకంటే ఎక్కువ మంది ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర పరిధిలో ఉన్న ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్లే జాతీయ రహదారులపై ప్రతి 50కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్​ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

ఇవీ చూడండి: ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details