తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు

తెలంగాణలో కొవిడ్​-19 వ్యాధి వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అనుమానిత ప్రాంతాల్లో ఆయా చోట్ల దారులన్నీ పూర్తిగా మూసివేసి, రాకపోకలను ఆపివేశారు. వివిధ శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే చేస్తూ కట్టుదిట్టంగా అనుమానితులను గుర్తిస్తూ కరోనా నివారణకు సిద్ధమయ్యారు.

Government all-out action to prevent corona in telangana
కరోనా నివారణకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు

By

Published : Apr 9, 2020, 7:41 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ సోకిన వ్యక్తులు ఉన్న అన్ని అనుమానిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పెద్దఎత్తున ఇంటింటి సర్వే చేపట్టింది. సుమారు 27 వేల మంది ఆశా కార్యకర్తలు, 8వేల మంది ఏఎన్‌ఎంలు, 31 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు పోలీసు, రెవెన్యూ, పుర/నగరపాలక, పంచాయతీరాజ్‌ సిబ్బంది పూర్తి సమన్వయంతో నివారణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రతి చోటా మొదట పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, అతడి నుంచి సోకిన వారిని, వీరితో సన్నిహితంగా మెలిగిన వారు, ఇందులో కరోనా లక్షణాలున్న వారు.. ఇలా వివిధ కోణాల్లో అనుమానితులను గుర్తిస్తున్నారు. వీరిని సత్వరమే స్వీయ నిర్బంధ పరిశీలనలో ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులున్న ప్రాంతాలన్నిటినీ ఎక్కడికక్కడ మూసేసి, ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైరస్‌ ఎక్కువ జిల్లాలకు విస్తరించడం, పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఈ పని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వందలాది బృందాలు ఈ క్రతువులో నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

వైరస్‌ కట్టడి ఇలా...

  • పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతానికి సుమారు కిలోమీటరు విస్తీర్ణాన్ని కరోనా కట్టడి బృందం తమ అధీనంలోకి తీసుకుంటోంది. ఆ ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావడానికి, లోపలకు వెళ్లడానికి వీలు లేదు. అన్ని దారులనూ పూర్తిగా దిగ్బంధం చేస్తారు. కేవలం ప్రభుత్వ సిబ్బంది వెళ్లడానికి ఒక మార్గం మాత్రమే తెరిచి ఉంచుతారు.
  • దిగ్బంధం చేసిన ప్రాంతంలో ప్రజలు తమకు నిత్యావసరాలు, కూరగాయలు, మందులు ఇలా ఏవి అవసరమైనా.. ప్రభుత్వమిచ్చిన టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేస్తే వెంటనే యంత్రాంగం స్పందిస్తోంది. కావాల్సిన వస్తువులను ప్రభుత్వ సిబ్బంది ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు.
  • పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రత్యేక యంత్రాల సాయంతో రసాయన ద్రావణాలతో తరచూ శుభ్రం చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రోన్లనూ వినియోగిస్తున్నారు.
  • ప్రతి వంద ఇళ్లకు నలుగురితో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక వైద్యుడు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఉన్నారు. ఇంటింటి సర్వేలో అనుమానితుల ఆరోగ్యాన్ని పరిశీలించడం వీరి పని. ఎవరికైనా వైరస్‌ లక్షణాలుంటే వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎలాగంటే...

  • నిజామాబాద్‌ జిల్లాలో వైరస్‌ ప్రభావిత ప్రాంతాలను 15 క్లస్టర్లుగా విభజించారు. ఆ ప్రాంతాల చుట్టూ కర్రలు కట్టి, కంచె వేశారు. వైరస్‌ సోకిన వ్యక్తులతో దగ్గరగా మసలిన వారందరినీ గుర్తిస్తూ క్వారంటైన్‌కు పంపుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మూడు క్లస్టర్లలో నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు, జోగులాంబ గద్వాల జిల్లాలో ఆరు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పాజిటివ్‌ వచ్చిన కుటుంబ సభ్యులకు క్వారంటైన్‌ ముద్ర వేసి, వారిని ఇంటికే పరిమితం చేశారు. వారి ఫోన్‌ నెంబర్లకు జియోట్యాగింగ్‌ చేశారు.
  • ఆదిలాబాద్‌ జిల్లాలో 27 చోట్ల దిగ్బంధం అమలు చేస్తున్నారు. పట్టణంలోని 19 వార్డులు, నేరడిగొండ మండలంలో మూడు గ్రామాలు, ఉట్నూరులోని అయిదు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో 168 బృందాలు సర్వే చేస్తున్నాయి. నిర్మల్‌ పట్టణంలో నాలుగు వార్డులు, భైంసాలోని ఒక వార్డులో కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.
  • ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నివసించే ప్రాంతంలో ఇళ్ల నుంచి ఎవరూ కదలకుండా కట్టుదిట్టం చేశారు. 13 ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి.
  • వరంగల్‌ నగరంలోని 15 ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. భూపాలపల్లి, జనగామ పట్టణాలు, నర్మెట్ట మండలంలోని వెల్డెండ గ్రామం, మహబూబాబాద్‌లోని ఏడు శివారు గ్రామాల్లోనూ నిర్బంధం అమలులో ఉంది. ములుగు జిల్లాలోని పస్రా, ఏటూరు నాగారంలో కట్టడి చర్యలు కొనసాగుతున్నాయి.
  • సంగారెడ్డి జిల్లాలో దిల్లీ వెళ్లి వచ్చిన ఆరుగురితో పాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే రామచంద్రాపురం ప్రాంతంలో ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో.. బాధితుల ఇళ్ల నుంచి కిలోమీటరు పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించి సూచికలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థ ద్వారా ఇంటింటికీ సరకులు పంపిస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణంలోనూ ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో.. ఆ కాలనీకి వెళ్లే ప్రధాన మార్గాన్ని మూసేశారు. కొండాపూర్‌ మండల కేంద్రంలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో.. ఆ ఊళ్లోకి రాకపోకలు లేకుండా కట్టుదిట్టం చేశారు. స్థానిక సర్పంచి, అధికారులు ఆటోల ద్వారా ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు.
  • నల్గొండ పట్టణంలోని మూడు ప్రాంతాలు, మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణంలోని 15 వార్డులు, నాగారం మండలంలోని ఓ గ్రామంలో నిర్బంధం విధించారు.
  • రాష్ట్రంలో మొదటిసారిగా కరీంనగర్‌లోనే కొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి దిగ్బంధం అమలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగారు. అక్కడ పాజిటివ్‌ కేసులను నాలుగుకు పరిమితం చేయగలిగారు. హుజూరాబాద్‌లోనూ మూడు కేసులు వచ్చిన కాలనీని దిగ్బంధం చేసి ఆంక్షలు విధించారు.

ఇదీ చూడండి :పోలీసుల కోసం.. ఓ కుటుంబం 10 లక్షల విరాళం

ABOUT THE AUTHOR

...view details