బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, కొవిడ్-19పై మానవాళి పోరాటంలో ఈ పరిశోధనలు కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు, వ్యాక్సిన్ అభివృద్ధికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020' అన్న అంశంపై మూడు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్.. రాజ్‌భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. కొవిడ్ సంక్షోభం “జీవితాలా - జీవనోపాదులా” అన్న సంక్లిష్ట సమస్యను ప్రపంచం ముందుంచిందన్న ఆమె... ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్నందున భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని చెప్పారు. భారతదేశం ప్రస్థుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో 20 శాతం వాటాను సాధిస్తుందని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని... కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని అన్నారు.