కరోనా కర్ఫ్యూ, వేసవి సెలవుల తర్వాత ఏపీలో మొదటిసారిగా.. నేడు ఉపాధ్యాయులు బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది... పాఠశాలకు హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో నేటి నుంచి విధులకు హాజరయ్యారు.
మొదటిరోజు... ప్రవేశాలు, విద్యార్థుల వివరాల నమోదుతోపాటు ఆన్‌లైన్ తరగతులకు వాట్సప్ గ్రూపు, డిజిటల్ కంటెంట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంది. శుక్రవారం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు బడులకు హాజరవుతారు. పాఠశాలలోని పని ఆధారంగా ఎవరు ఏ రోజు బడికి రావాలనే దాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 50 శాతం సిబ్బంది ప్రతిరోజు హాజరు కావాలి.