Gopala Mitra Telangana : రాష్ట్రంలోపాడి రంగం, రైతుల అభ్యున్నతి కోసం తమ సేవలందిస్తున్న గోపాలమిత్రలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోన్నారు. వ్యవసాయ అనుబంధంగా పాడి రంగంలో మేలు జాతి ఆవులు, గేదెల పునరుత్పత్తి, పాల ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు లక్ష్యంగా ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థకు.. ఆశించిన సహకారం అందడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 23 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలందించడంతోపాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రులు భాగస్వామ్యం అవుతున్నారు.
Gopala Mitra Issues in Telangana :నిజానికి గోపాలమిత్రుల ముఖ్య విధి..పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించడ మాత్రమే. కానీ పశుసంవర్థక శాఖ నిర్వహిస్తున్న పశు గర్భకోశ చికిత్స వైద్య శిబిరాలు, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ.. పశుగ్రాసాల పెంపకం, పశువుల్లో టీకాల లాంటి అన్నిరకాల కార్యక్రమాల్లో కూడా పనిచేస్తూ సేవలందిస్తున్నారు. నెల వారీ లక్ష్యాల్లో ఒక్కోసారి వెనుకబడి గౌరవ వేతనాల చెల్లింపుల్లోనూ కోతలు పెడుతుండటంతో.. బతుకులు దినదిన గండంగా మారాయని గోపాలమిత్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. విజ్ఞప్తి చేస్తున్నారు.
"సొంత రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ జీతాలు పెంచారు. కానీ ప్రస్తుతం ఉన్న ధరలకు వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదు. గేదెలకు, ఆవులకు ఏ రాత్రి ఏం జరిగినా మాకు సమాచారం రాగానే వెళ్లి మేము సేవలు అందిస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని వేడుకుంటున్నాం."- గోపాల మిత్ర ఉద్యోగులు
ఏ రాత్రి అయినా సేవలు అందిస్తున్నాము :రోడ్డు సౌకర్యం లేని పల్లెలకు వెళ్లి సేవలందిస్తున్న నేపథ్యంలో.. కనీస వేతనం ఇచ్చి పశుగణాభివృద్ధి సంస్థను పశుసంవర్థక శాఖలో విలీనం చేయాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఆఫీసు సబార్డినేట్స్‌గా పశుసంవర్థక శాఖలో 50 శాతం కోటా ఇచ్చి నియమించడం.. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని గోపాలమిత్రలు కోరారు. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం.. తమకు వర్తింపజేయాలని గోపాలమిత్రలు విజ్ఞప్తి స్తున్నారు