తెలంగాణ

telangana

ETV Bharat / state

గూగుల్​పే, ఎనీ డెస్క్, పేటీఎం పేర్లతో లక్షలు స్వాహా

ఆన్​లైన్ మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు లక్షల రూపాయలు లాగేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రోజుకు కనీసం 30 లక్షల నుంచి 50 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు. తాజాగా పలు రకాలుగా సైబర్​ దోపిడి చేసిన కేసుల వివరాలు ఇప్పడు చుద్దాం.

Google Pay, Any Desk, GST name with cyber cheating in hyderabad
గూగుల్​పే, ఎనీ డెస్క్, పేటీఎం పేర్లతో లక్షలు స్వాహా

By

Published : Aug 9, 2020, 10:16 PM IST

సికింద్రాబాద్ బాలంరాయ్​కి చెందిన నాగమల్లేశ్ తన ఫోన్​లో గూగుల్​పే ద్వారా తెలిసిన వారికి డబ్బు పంపించాడు. ఆ డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. దాంతో కస్టమర్ కేర్ కోసం అంతర్జాలంలో వెతికి ఓ నంబరుకు ఫోన్ చేశాడు. తర్వాత ఓ వ్యక్తి ఫోను చేయగా... సమస్యను వివరించాడు. వెంటనే క్విక్ సపోర్ట్ యాప్​ను డౌన్​లోడ్ చేయించి.. నాగమల్లేశ్ ఖాతా నుంచి రూ.2.20 లక్షలు కొట్టేశారు.

రుణం ఇస్తామని..

మరో కేసులో సికింద్రాబాద్​కు చెందిన శివరాజుకు రుణం ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలు తెలుసుకుని 1.50 లక్షలు వరకు ఇచ్చే వెసులుబాటు ఉందని నమ్మించాడు. ముందు జీఎస్టీ అని రూ.24 వేలు, ఎన్​వోసీ కోసమని రూ.45 వేలు ఇలా మొత్తం 1.50 లక్షలు లాగేశాడు. ఆ తర్వాత ఫోన్ బంద్ చేశాడు. బాధితుడు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

పేటీఎం, కేవైసీ అప్​డేట్

సికింద్రాబాద్ పద్మారావునగర్​కు చెందిన దిలీప్ కుమార్​కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. పేటీఎం, కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని సూచించాడు. అందుకు తాను సంసిద్ధత వ్యక్తం చేయగా.. ఎనీ డెస్క్ యాప్​ను డౌన్​లౌడ్ చేయించారు. కొద్ది సేపట్లోనే ఖాతాలోంచి రూ.94 వేలు పోయాయి. వెంటనే బాధితులు పోలీసు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బ్యాంక్ అధికారి అంటూ...

బోయినపల్లికి చెందిన రమణకు బ్యాంక్ అధికారి అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు. ఖాతాను అప్​డేట్ చేసుకోవాలని సూచించి.. పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. కొద్దిసేపటిలో ఖాతాలోంచి రూ.1.25 లక్షలు డ్రా అయినట్లు మేసేజ్ రావడం వల్ల బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

గూగుల్​పే పేరుతో..

సికింద్రాబాద్​కు చెందిన సాలోమన్ రాజు గూగుల్​పే సరిగా పనిచేయకపోవడం వల్ల.. కస్టమర్ కేర్​కు ఫోన్ చేశాడు. మొదట్లో ఎవరూ స్పందించలేదు. తర్వాత కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి రూ. 86 వేలు దోచేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :'ప్రజా వినతులు స్వీకరించేందుకు కేటీఆర్ సమయం కేటాయించాలి'

ABOUT THE AUTHOR

...view details