రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు చెప్పనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అదే రోజు నరసింహన్ బాధ్యతల నుంచి వైదొలిగి రాత్రి 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 6 గంటలకు విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలకనుంది.
గురువారం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు గవర్నర్ నరసింహన్ దంపతులతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ సేవలను పోచారం ప్రశంసించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య గవర్నర్‌ను కలిసి తాను రూపొందించిన ఆయన చిత్రాన్ని అందజేశారు. తెదేపా తెలంగాణ నాయకులు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.