Cotton Mirchi Price: రాష్ట్రంలో ఈ ఏడాది తెల్ల బంగారం(పత్తి), ఎర్ర బంగారం(మిర్చి) ధరలు ప్రతిరోజు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ రైతులకు మంచి ధరలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి మార్కెట్‌లో సోమవారం క్వింటా పత్తి రూ.10,869 ధర పలికి ఈ సంవత్సరం నూతన గరిష్ఠాన్ని నమోదు చేసింది. అదేవిధంగా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో 100 కిలోల దేశీ మిర్చి రూ.45 వేలు పలికి బంగారం ధరను తలపించింది. పెద్దపల్లి మార్కెట్‌కు 37 మంది రైతులు సోమవారం 146.3 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు.
పత్తి విక్రయాలు చివరి దశకు రావడం..మార్కెట్‌లో కొరత కారణంగా వ్యాపారులు కొనుగోలుకు పోటీపడ్డారు. దీంతో క్వింటా పత్తికి గరిష్ఠ ధర రూ.10,869, సగటున రూ.9,325గా నమోదైంది. జమ్మికుంట మార్కెట్‌కు 12 ట్రాలీల విడి పత్తి విక్రయానికి రాగా గరిష్ఠంగా రూ.10,810 పలికింది. వరంగల్‌లో రూ.10,720, ఖమ్మంలో రూ.10,600, ఆదిలాబాద్‌లో రూ.10 వేలు పలికింది.