రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆదుకునేందుకు బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించింది. ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేసి రూ.1,810 కోట్లు కేటాయించారు. అయితే నిరుద్యోగులు ఎవరు..? ఎంతమంది ఉన్నారు..? అన్న విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. విధివిధానాలూ ఖరారు కావల్సి ఉంది.
తెరాస మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే ప్రతీ నెల 3వేల 16 రూపాయలు ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అయితే నిరుద్యోగ భృతి ఏ శాఖ ద్వారా అమలు చేయనున్నారో స్పష్టం చేయలేదు. కార్మిక, ఉపాధి కల్పన శాఖ పరిధిలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో పునరుద్ధరణ చేసుకున్న నిరుద్యోగులు సుమారు 9 లక్షల మంది ఉన్నారు. ఈ కార్యాలయాల ద్వారా ఉద్యోగాలకు పిలుపు రావడం లేదన్న ఉద్దేశంతో చాలా మంది దరఖాస్తు చేసుకోవడం లేదు. పునరుద్దరణ చేసుకోనివారితో కలిపితే దాదాపు 15 లక్షల వరకు ఉన్నట్లు అంచనా.