తెలంగాణ

telangana

ETV Bharat / state

మధుమేహులకు ఊరట... ఆ ధరలు ఇక తగ్గనున్నాయట! - ఇన్సులిన్‌ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది

ప్రపంచంలో ఇన్సులిన్‌ అమ్మకాల్లో కొన్ని ఉత్పత్తి సంస్థలకే గుత్తాధిపత్యం, ధరలు భారీగా ఉండటాన్ని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. మరిన్ని ఇన్సులిన్‌ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. నేడు ప్రపంచ మధుమేహ దినాన్ని పురస్కరించుకుని ‘ఇన్సులిన్‌’ ధరను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

మధుమేహులకు గుడ్​న్యూస్​..

By

Published : Nov 14, 2019, 9:33 AM IST

రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచడానికి మధుమేహులు వినియోగించే ‘ఇన్సులిన్‌’ ధరను తగ్గించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)దృష్టిపెట్టింది. ప్రపంచంలో ఇన్సులిన్‌ అమ్మకాల్లో కొన్ని ఉత్పత్తి సంస్థలకే గుత్తాధిపత్యం, ధరలు భారీగా ఉండటాన్ని గుర్తించింది. మరిన్ని ఇన్సులిన్‌ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఆదాయంలో సుమారు 22 శాతం

నేడు ప్రపంచ మధుమేహ దినాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఈ తరహా ప్రయోగాత్మక చొరవకు శ్రీకారం చుట్టినట్లుగా బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లోని మధుమేహులు తమ నెల ఆదాయంలో సుమారు 22 శాతం ఇన్సులిన్‌ కోసమే ఖర్చుపెడుతున్నట్లుగా డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. సాధారణంగా రెండు రకాల ఇన్సులిన్‌లను మధుమేహులు వినియోగిస్తున్నారు. మొదటి రకం(హ్యూమన్‌ ఇన్సులిన్‌) వినియోగించే వారు ప్రపంచంలో దాదాపు 61 శాతం మంది ఉండగా, రెండో రకం (అనలాగ్‌ ఇన్సులిన్‌) వినియోగించేవారు 13 శాతం మంది మాత్రమే.

కొన్ని సంస్థలదే గుత్తాధిపత్యం

మొదటి రకం ఇన్సులిన్‌ ఖరీదు తక్కువ. మన దేశంలో సుమారు రూ.140 ఉంటుంది. దీని వాడకం వల్ల వారంలో కనీసం మూణ్నాలుగు సార్లైనా రక్తంలో చక్కెర స్థాయులు ఉన్నట్లుండి పడిపోయే(హైపోగ్లైసిమియా) అవకాశాలు అధికం. రెండో రకం ఇన్సులిన్‌ ఖరీదు సుమారు రూ.600-1400 వరకూ ఉంది. దీని వాడకం వల్ల హైపోగ్లైసిమియా వారంలో ఒకట్రెండు సార్లు మాత్రమే ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ రెండో రకం ఇన్సులిన్‌ ఉత్పత్తిలో కొన్ని సంస్థలదే గుత్తాధిపత్యం. దీంతో ఆయా సంస్థలు ఇన్సులిన్‌ ధరలను ఆకాశానికి పెంచేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండో రకం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే సంస్థలను నేరుగా తానే ప్రోత్సహిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మె - అట్టుడుకుతున్న రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details