తెలంగాణ

telangana

ETV Bharat / state

BONALU: ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు! - hyderabad district latest news

హైదరాబాద్‌ నగరానికి తలమానికమైన ఆషాఢ బోనాల జాతరకు సమయం ఆసన్నమైంది. గతేడాది కరోనా దృష్ట్యా నామమాత్రంగా నిర్వహించిన వేడుకలను.. ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూనే ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించింది.

ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!
ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!

By

Published : Jun 25, 2021, 8:53 PM IST

ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!

మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జులై 11న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు మొదలవ్వనున్నాయి. జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నిర్వహించనున్నారు. ఆగస్టు 1న హైదరాబాద్ సహా శివారుల్లోని ఆలయాల్లో బోనాల ఉత్సవాలు చేపట్టనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మేయర్ విజయ లక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, డీజీపీ అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌ భగవత్‌, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ప్రతి ఏడాదిలాగే ఈసారీ బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తలసాని అధికారులను కోరారు. బోనాలకు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా డీజీపీ, మూడు కమిషనరేట్ల పరిధిలోని సీపీలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. బోనాలను విజయవంతం చేసేందుకు ప్రజలూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గతంలో బోనాలు చందాలు వేసుకుని చేసేవాళ్లమని.. ఇప్పుడు బోనాల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే ఇస్తుందని మంత్రి గుర్తు చేశారు.

రూ.15 కోట్లు కేటాయింపు..

బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణ కోసం వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లను కేటాయించిందని మంత్రి తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌లను అందుబాటులో ఉంచాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు

బోనాల సందర్భంగా 189 దేవాలయాల వద్ద కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం తదితర 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.

సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు..

సాంస్కృతికశాఖ, విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో వేడుకలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

ప్రజలు సహకరించాలి..

కరోనా కారణంగా గతేడాది బోనాల పండగ.. కేవలం అతి కొద్దిమంది సమక్షంలోనే ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది బోనాల ఉత్సవాన్ని... కొవిడ్‌ నిబంధనల మధ్య జరుపుకునేందుకు రూ.15 కోట్లను కేటాయించింది. ఉత్సవాల వేళ ప్రజలు పోలీసులకు, ఇతర శాఖ అధికారులకు సహకరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. బోనాల పేరిట ఎవరూ చందాలు వసూలు చేయొద్దని.. డీజీపీ స్పష్టం చేశారు. బోనాల వేళ కొవిడ్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి... గ్రేటర్ పరిధిలోని ఆలయ కమిటీలకు అధికారులు అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి: Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు

ABOUT THE AUTHOR

...view details