వినాయక చవితి సంబరం అంబరాన్నంటింది..గణేశ్ నవరాత్రులతో రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పల్లె, పట్నం ఎటు చూసినా విఘ్నాలు తొలగించే లక్ష్మీ గణపతి నామస్మరణతో మార్మోగుతోంది. పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక ప్రాంతాల్లో ప్రజలు మట్టి వినాయకునికి జై కొట్టారు.
గల్లీ గల్లీలో కొలువుదీరిన బొజ్జ గణనాథులు భక్తి శ్రద్ధలతో పూజలందుకుంటున్న వినాయకుడు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నరకాలైన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిజామాబాద్‌లోని రవితేజ యూత్ ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2వేల 7వందల కొబ్బరి బోండాలతో ప్రతిమను అలంకరించారు.
నవరాత్రులతో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ
సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచన మేరకు గ్రామస్థులంతా ఒకే వినాయకుణ్ని ప్రతిష్ఠించారు. మహబూబ్‌నగర్‌లోని వివిధ మండపాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
విద్యుత్ కాంతుల నడుమ గణనాథుడు
ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ పేటలో కొలువుదీరిన 38 అడుగుల మహా గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వరంగల్‌లో విద్యుత్ కాంతుల నడుమ గణనాథుడు మెరిసిపోతున్నాడు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు మట్టి వినాయకుణికి పూజలు నిర్వహించారు.
ఈసారి మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం
సంగారెడ్డిలోని గంజి మైదానంలో ప్రతిష్ఠించిన గణనాథునికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పూజలు నిర్వహించారు. శ్రీ వైకుంఠపుర క్షేత్రంలో 20అడుగుల భారీ మట్టి వినాయకుడు కొలువుదీరాడు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దంపతులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విభిన్న రూపాల్లో లంబోదరుల దర్శనం
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో విభిన్న రూపాల్లో లంబోధరులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. విద్యుత్ వెలుగులతో మండపాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి.
సాఫ్ట్వేర్ గణపతి
హైదరాబాద్ మైత్రివనంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ గణపతి విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. జెట్‌కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సాంకేతిక శిక్షణ కేంద్రం విద్యార్థులు ప్రతిమను తయారుచేశారు.
ఇవీ చూడండి: బడికి పోవాలంటే 'వేలాడే ఫీట్' చేయాల్సిందే