Gold smuggling gang attack on police: బంగారం స్మగ్లింగ్ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై దాడిచేసిన కేసులో 8 మందిని హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి బంగారం అక్రమమార్గంలో తెచ్చి అమ్ముతున్నారనే సమాచారంతో మైలార్‌దేవ్‌పల్లి స్టేషన్ ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు.. సర్దార్ మహల్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌కు వెళ్లి ఆయాజ్, ఖాదర్, సోహైల్, ఒవైసీ తదితరులను ప్రశ్నించారు.
ఐతే నలుగురు నిందితులు మరికొందరితో కలిసి పోలీసులపై దాడి చేశారు. సమాచారం అందుకున్న మొగల్‌పుర పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ పొలీసులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులంతా బెంగాల్ వాసులని గుర్తించారు.
బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం..విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు సైబరాబాద్ కమిషనరేట్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ నెర విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ గౌడ్, నలుగురు కానిస్టేబుల్స్ ముఖ్తార్, అశోక్, విజయ్ కుమార్, రాజారావుతో కలిసి సర్దార్ మహల్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌కు వచ్చారు. అక్కడ బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్ ఆయాజ్, ఖాదర్, సోహైల్, ఒవైసీ తదితరులను విచారిస్తున్నారు.
gold smuggler attack on police: ఈ క్రమంలో నిందితులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఐరన్ రాడ్లు, స్టిక్లు, లెదర్ బెల్ట్‌తో తీవ్రంగా గాయపరిచారు. పోలీసుల నుంచి మొబైల్ ఫోన్లు, పర్స్‌లు, ఐడీ కార్డులు, ఒక తులం బంగారం చైన్ లాక్కొని పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న మొగల్‌పుర ఇన్‌స్పెక్టర్ శివ కుమార్ తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 8 నిందితులను గుర్తించి.. వారిని అరెస్ట్ చేశారు.
మరికొందరు పరారీలో ఉండగా.. వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు మొగల్‌పుర పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 3 ఐరన్ రాడ్లు, 3 స్టీక్స్, లెదర్ బెల్ట్, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ బెంగాలీ వాసులుగా పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు విచారణకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. తమకు ఆధునిక రక్షణ పరికరాలు అందజేయాలని కోరుతున్నారు.