Gold Smuggling : విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే అక్రమార్కుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కస్టమ్స్ దిగుమతి సుంకం 15 శాతానికి పెరిగిన తర్వాత దానిపై 3 శాతం జీఎస్టీ కలిపి మొత్తం 18 శాతం చెల్లించాల్సి వస్తోంది. అదే అక్రమంగా తరలించే బంగారంపై 38.5 శాతం సుంకం, మరో 3 శాతం జీఎస్టీ కలిపి మొత్తం 41.5 శాతం చెల్లించాల్సి వస్తుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులే ఎక్కువగా ఈ అక్రమ బంగారాన్ని తరలిస్తున్నట్టుగా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో కష్టమ్స్, డీఆర్ఐ అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా నిఘా పెంచాయి.
ఎత్తులకు పైఎత్తులు: అధికారుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అక్రమార్కులు బంగారాన్ని దేశంలోకి తరలిస్తున్నారు. పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, మనిషి ప్రైవేట్ భాగాల్లో పెట్టుకుని తెస్తున్నారు. పాదరక్షలు, లగేజ్ బ్యాగుల ప్రత్యేక లేయర్లలో బంగారం తెస్తున్నట్లుగా ఇటీవల పలు కేసుల్లో బయటపడింది. ప్యాంట్లు, షర్టులు, లో దుస్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పొరల్లో ఈ బంగారం దాచేస్తున్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ నుంచి ఈ బంగారం తరలివస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
జప్తు చేసిన బంగారం: ఫిబ్రవరి 22న సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి భారీగా రూ.7.89 కోట్ల విలువైన 14.90 కిలోల బంగారం కస్టమ్స్ విభాగం జప్తు చేసింది. ఫిబ్రవరి 24న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.47 లక్షల విలువైన 823 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు దీనిని తన లోదుస్తుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లేయర్లలో దాచుకొని తెచ్చారు. మార్చి 28న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.51.24 లక్షల విలువైన 840 గ్రాములు, అదే రోజు మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 223 గ్రాములు, మార్చి 29న సుడాన్ నుంచి వచ్చిన నలుగురు మహిళా ప్రయాణికుల వద్ద రూ.1.94 కోట్ల విలువైన 3175 గ్రాముల బంగారం గుర్తించారు. వీరు బంగారాన్ని పేస్టు రూపంలో ఉండలుగా చేసి, ప్రైవేట్ భాగాల్లో దాచుకొని తెచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో తేల్చారు.
ఈ నెల 3, 4, 5 తేదీల్లో దుబాయ్, దోహా, రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి రూ.కోటీ 17 లక్షల విలువైన 1904 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పెరుగుతున్న బంగారం అక్రమ రవాణా కేసులతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. బంగారం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
పెరుగుతున్న విదేశీయుల బంగారం స్మగ్లింగ్ ఇవీ చదవండి: