తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు

బ్యాంకుల్లో  బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోవటం ఇకపై రద్దు కానుంది.  వచ్చే అక్టోబర్‌ నుంచే ఇది చెల్లదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒకవేళ రుణాలు తీసుకోవాలంటే... సాధారణ వడ్డీలు వసూలు చేయనున్నారు.

By

Published : Aug 8, 2019, 5:27 AM IST

Updated : Aug 8, 2019, 12:39 PM IST

ఇకపై వ్యవసాయానికే వ్యవసాయ రుణాలు

ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు

పంటల పెట్టుబడుల కోసం బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకునే రుణాలు ఇక వ్యవసాయ రుణ ఖాతాలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. ఆ రుణాలకు ఇచ్చే వడ్డీ రాయితీ వర్తించదని తేల్చిచెప్పింది. వచ్చే రబీ సీజన్‌ అంటే అక్టోబరు 1 నుంచి ఇచ్చే బంగారు తాకట్టు రుణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. రైతులు తీసుకునే వ్యవసాయ రుణాలకు సంబంధించిన నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ దేశంలో అన్ని బ్యాంకులు, వ్యవసాయ శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఆధార్​ తప్పనిసరి

రైతు తీసుకునే పంట రుణాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పేరిట ఇవ్వాలి. ఈ ఖాతాకు రైతు ఆధార్ సంఖ్య తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభ తేదీ అంటే గత ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ఇచ్చిన పంట రుణాల్లో కేసీసీకి ఆధార్ అనుసంధానం కాని ఖాతాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీ వర్తించదు. ఒక రైతు పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే నిర్ణీత గడువులోగా కట్టినట్లు పరిగణిస్తారు. అప్పుడు సదరు రైతు ఖాతాలో దానిపై పడే వడ్డీలో 3 శాతం కేంద్రం ఇస్తోంది.

ఇకపై బంగారం తాకట్టుపెడితే వడ్డీ వర్తిస్తుంది

అధిక శాతం రైతులు ఈ పంట రుణం తీసుకున్న తర్వాత తిరిగి బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణంగా తీసుకుంటున్నారు. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాల్లో 25 శాతం పైగా బంగారం తాకట్టు రుణాలే ఉన్నట్లు కేంద్రం అధ్యయనంలో తేలినట్లు సమాచారం. దీన్ని అధిగమించడానికి బంగారాన్ని పంట రుణం జాబితా నుంచి తొలగిస్తే... అసలు బ్యాంకులు వాస్తవంగా ఎంత ఇస్తున్నాయనేది తేలుతుందని భావిస్తున్నారు. ఇతర సాధారణ ప్రజలు బంగారం తాకట్టుపెడితే 9 నుంచి 12 శాతం వరకు వడ్డీ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. వచ్చే అక్టోబరు నుంచి రైతులకు ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

రాష్ట్రం మిగిలిన 4 శాతం వడ్డీని భరిస్తుందా?

తెలంగాణలో వడ్డీ లేని రుణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ప్రకారం... నిర్ణీత గడువులోగా రైతులు పంట రుణం తిరిగి చెల్లిస్తే వడ్డీని పూర్తిగా వ్యవసాయ శాఖ భరిస్తోంది. అంటే మొత్తం 7 శాతం వడ్డీలో కేంద్రం 3 శాతం ఇస్తే రాష్ట్రం మిగిలిన 4 శాతం కడుతోంది. బంగారం తాకట్టు రుణాలు కూడా ఇంత కాలం ఇందులోనే ఉన్నాయి. ఇక నుంచి కేంద్రం బంగారం రుణాలను పక్కనపెట్టిన దృష్ట్యా... వాటికి రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండిః నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన

Last Updated : Aug 8, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details