శ్రీశైలంలోని ఘంటామఠంలో మరోసారి బంగారు నాణేలు బయటపడ్డాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వాయువ్య భాగంలో ఉన్న ఘంటామఠం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తుండగా నీటి కోనేరు రాతి పొరల మధ్య 2 డబ్బాలు బయటపడ్డాయి. వాటిని తెరచి చూడగా 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం, 18 వెండి నాణేలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకొని బంగారు నాణేలకు పంచనామా నిర్వహించారు. ప్రాచీన కాలానికి చెందిన పంచ మఠాల్లో ఒకటైన ఘంటా మఠం విశేషమైనది. మూడేళ్ల క్రితం ఇక్కడ నిర్మాణాలు చేస్తుండగా బంగారు నాణేలు బయటపడ్డాయి. పది రోజుల క్రితం 245 వెండి నాణేలు బయటపడ్డాయి. తాజాగా.. మరోసారి బంగారు నాణేలు బయటపడడంపై.. భక్తులు ఆశ్చర్యపోతున్నారు.