పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబవుతోంది. గోల్కొండ ఖిల్లాలో ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షించారు. ఆయనతోపాటు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం వచ్చే దారిలో ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు గోల్కొండ కోటలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులు ముందస్తుగా కవాతు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. పోలీసు బ్యాండు మధ్య కవాతు ప్రదర్శించారు. ట్రాఫిక్, భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని సీపీ తెలిపారు. ఆగస్టు 15న ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి ప్రత్యేక పాస్‌లు జారీచేస్తున్నట్లు వివరించారు.