మెతుకు సీమలో గోదారమ్మ రాకకు వేళయింది.. నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడపడానికి గోదారి కాలు మోపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయక సాగర్ వరకు చేరుకున్న గోదావరి జలాలను... వానాకాలం లోపు కొండపోచమ్మ సాగర్ జలాశయానికి ఎత్తిపోసేందుకు విద్యుత్తు శాఖ చేపట్టిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని అక్కారం, మర్కూక్ పంపుహౌస్‌లను ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఎత్తిపోతల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ రెండు ఎత్తిపోతల్లోని పంపులు, ఇతర పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్తు శాఖ మొదటి నుంచీ అప్పగించిన పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేస్తోందని, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న అక్కారం, 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న మర్కూక్ పంపుహౌస్‌ల పనులను ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగతదూరం పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. నాలుగు బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని, తుది పరీక్షలు పూర్తి చేసి నీటిని ఎత్తిపోయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, సంచాలకులు జె.సూర్యప్రకాశ్, ఈడీ పీవీ ప్రభాకర్‌రావు, పర్యవేక్షక ఇంజినీర్లు ఆంజనేయులు, వేణు పాల్గొన్నారు.