ఇటీవల జరిగిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశంలో గోదావరి మళ్లింపు వాటా అంశంపై చర్చ జరిగింది. వీటితోపాటు చర్చించిన అన్ని అంశాలపై మినిట్స్ తయారు చేసిన బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది. సమావేశంలో చర్చించినదానికి, మినిట్స్‌లో రాసిన దానికి చాలా వ్యత్యాసాలున్నాయని ఆంధ్రప్రదేశ్ భారీగా మార్పులు సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు రెండురోజుల క్రితం సుదీర్ఘ లేఖ రాశారు.
ఆ 45 టీఎంసీలు మాకే
పోలవరం నిర్మాణం వల్ల కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలనుకోవడంపై 2018 ఫిబ్రవరిలో కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ వద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి కృష్ణాబోర్డు రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రానికి పంపుతుందని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-2 ముందు తెలంగాణ స్టేట్‌మెంట్ ఆఫ్ కేస్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిందని, ట్రైబ్యునల్ కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశంలో చెప్పినా ఈఅంశం బోర్డుపంపిన మినిట్స్‌లో రికార్డు కాలేదు. పోలవరం ప్రాజెక్టు, దీని కమాండ్ ఏరియా మొత్తం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. పోలవరం నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీల వల్ల నాగార్జునసాగర్ నుంచి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీరు ఆమేరకు తగ్గిపోతుంది. ఇలా మళ్లించే నీటిలో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు, 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి ఉంది. ఈ వాటా నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిగులు జలాల ఆధారంగా 150.5 టీఎంసీలతో చేపట్టిన ప్రాజెక్టులకు వాడుకుంటాం. ఇది పోనూ మిగులు జలాల ప్రాజెక్టులకు 105.50 టీఎంసీలు అవసరమవుతాయి. తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీల నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లిస్తోంది. ఇలా మళ్లించే నీటిలో ఏ రాష్ట్రాన్నీ వాటా కోరకుండా ఆపలేరని బచావత్ ట్రైబ్యునల్ పేర్కొంది. దీని ప్రకారం చాలా ఎక్కువ వాటా వస్తుంది. ఈ అంశాలు, వివరణలను మినిట్స్‌లో పొందుపరచాలని, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించేవరకు ముందుకెళ్లరాదని తెలంగాణకు సూచించాలని పేర్కొంది.