గోదావరి నదీ బోర్డు భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలి : తెలంగాణ - krmb
18:35 August 02
గోదావరి నదీ బోర్డు భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలి : తెలంగాణ
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో రెండు బోర్డులు రేపు సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. నోటిఫికేషన్ అమలు కార్యాచరణ కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి రేపు మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రేపు సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ... పూర్తి స్థాయి బోర్డు సమావేశం తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. అయితే గోదావరి బోర్డు మాత్రం దాంతో విభేదించింది.
నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారు చేసేందుకు రేపు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్న జీఆర్ఎంబీ... ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి గోదావరి బోర్డు సభ్యకార్యదర్శి వెంటనే లేఖ రాశారు. సమన్వయ కమిటీ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక, నిర్ధిష్ట గడువులు ఖరారు చేశాక పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. రేపటి సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధిత డాక్యుమెంట్లతో హాజరు కావాలని కోరారు. అటు కృష్ణానదీ యాజమాన్య బోర్డు కూడా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: IRRIGATION: నల్గొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలు మంజూరు