దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది (Godavari River) గరళంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రవేశించే కందకుర్తి(బాసర) నుంచి.. సరిహద్దు బూర్గంపహాడ్(భద్రాచలం) వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇందులో కలిసే ఉపనదులూ విషాన్ని మోసుకొస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలు కాలుష్యానికి ఆలవాలంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మనుషులు వినియోగించేందుకే కాదు.. జలచరాలకూ గడ్డు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఇళ్లలోని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా వచ్చి నదిలో కలుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పరిశ్రమల యజమానులు వర్షపునీటిలో రసాయన వ్యర్థాల్ని కలిపేసి నదుల్లోకి వదులుతున్నారు. గోదావరిఖని కోల్‌బెల్ట్ ప్రాంతంలో తాజాగా నదిలో పెద్దమొత్తంలో నురగ ఏర్పడటం కలవరం కలిగిస్తోంది. గోదావరితోపాటు అందులో కలిసే ఉపనదులు, 50కిపైగా నాలాల నుంచి వచ్చే కాలుష్య ప్రభావాన్ని ‘ఈనాడు, ఈటీవీ భారత్' పరిశీలించింది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) 2021 గణాంకాల్నీ ఆరా తీయగా.. పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉందని అర్థమవుతోంది.
ఏ ప్రాంతంలో ఎలా కలుషితం అవుతోందంటే..?
బాసర:మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఇక్కడికి 5 కి.మీ. దూరమే. అక్కడి ఓ మద్యం కంపెనీ.. శుద్ధిచేయని రసాయన వ్యర్థాల్ని వదులుతోంది. ఏడాదంతా పరిశ్రమ ఆవరణలో నిల్వచేసి వర్షాకాలం రాగానే నదిలోకి పంపిస్తుండటంతో బాసర వద్ద గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి.
రామగుండం:నిత్యం 40 ఎంఎల్‌డీలకుపైగా మురుగునీరు, ఓ పరిశ్రమ వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. ధర్మపురి, మంథని పట్టణాలు, తీర గ్రామాల నుంచి మరో 40 ఎంఎల్‌డీల మురుగు వచ్చిచేరుతోంది.
మంచిర్యాల:18 ఏళ్లక్రితం నిర్మించిన ఎస్టీపీలు నిర్వహణలేక నిరుపయోగంగా మారాయి. పట్టణంలో మురుగునీరు రాళ్లవాగులోకి అక్కడి నుంచి గోదావరిలోకి చేరుతోంది.
గౌడిచర్ల:పటాన్‌చెరు పరిశ్రమల కాలుష్య జలాల్ని తీసుకువచ్చే నక్కవాగు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గౌడిచర్ల వద్ద మంజీరలో కలుస్తుంది. బచ్చులగూడెం వద్ద బాగా కలుషితం అవుతోంది.
భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని మురుగునీరంతా ఆరు కాలువల నుంచి గోదావరిలో కలుస్తోంది. శుద్ధికేంద్రం లేదు.
బూర్గంపాడు:మండలంలోని సారపాకలో ఓ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయన జలాలు గోదావరిలో చేరుతున్నాయి.