Godavari Express Accident: విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.. అయితే రైలు పట్టాలు తప్పిన బోగీలకుగానీ, అందులో ఉన్న ప్రయాణికులకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి ఎల్‌హెచ్‌బీ బోగీలే కారణమని అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదమే తప్పి.. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఎయిర్ కండీషన్ టెక్నాలజీ ఉండడంవల్ల ఆరు బోగీలు కేవలం విడిపోవడం మాత్రమే జరిగిందని.. దీంతో పెను ప్రమాదమే తప్పిందని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పూర్తిగా విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విడిపోయిన బోగీలలో జనరల్‌లో సుమారు 120 ఉండవచ్చని, మిగిలిన స్లీపర్ కోచ్‌లలో 300 మంది ప్రయాణిస్తున్న ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 1500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అసలేంటీ ఎల్‌హెచ్‌బీ బోగీలు అంటే: గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు యాంటీ టెలిస్కోపిక్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్మన్ బుష్) బోగీలు అమర్చడం వల్ల కోచ్‌లు ఒకదానితో ఒకటి ఢీ కొనలేదు. అవి పక్కకు వంగి పడిపోలేదు. ఒకవేళ రైలు పట్టాలు తప్పినప్పుడు కోచ్‌లు అనేవి విడిపోతాయి. దీనివల్ల పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. తక్కువ నష్టం జరుగుతుంది. మొట్టమొదటగా జర్మనీలో తయారయిన ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలను.. 2000వ సంవత్సరం నుంచి భారతదేశంలో వినియోగిస్తున్నారు.