తెలంగాణ

telangana

ETV Bharat / state

GODAVARI RIVER BOARD: తెలుగు రాష్ట్రాలకు జీఆర్​ఎంబీ లేఖ - telangana news 2021

GODAVARI RIVER BOARD: తెలుగు రాష్ట్రాలకు జీఆర్​ఎంబీ లేఖ
GODAVARI RIVER BOARD: తెలుగు రాష్ట్రాలకు జీఆర్​ఎంబీ లేఖ

By

Published : Jul 16, 2021, 8:56 PM IST

Updated : Jul 16, 2021, 10:30 PM IST

20:54 July 16

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను కోరిన గోదావరి బోర్డు

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు మరోమారు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,  ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులకు జీఆర్ఎంబీ సభ్యుడు పి.ఎస్.కుటియాల్ లేఖ రాశారు. 2020 అక్టోబర్​లో జరిగిన అత్యున్నత మండలి, జూన్​లో జరిగిన బోర్డు సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా డీపీఆర్​లు సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్​లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని బోర్డు తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఇచ్చిన డీపీఆర్​లను బోర్డు, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు లోబడి ఇవ్వాలని జీఆర్ఎంబీ పేర్కొంది. తెలంగాణ నుంచి ఇంకా ఎలాంటి డీపీఆర్​లు అందలేదని తెలిపింది. వీలైనంత త్వరగా డీపీఆర్​లు సమర్పించాలని రెండు రాష్ట్రాలను కోరింది.

విభజన చట్టం ప్రకారం నీటి వాటా పంపిణీ

మరోవైపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర జల్​శక్తి శాఖ గురువారం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను ఈరోజు జల్‌శక్తి అధికారులు వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని, అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 2016 సెప్టెంబర్‌లో తొలిసారి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమైందని.. నాటి భేటీలో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని వెల్లడించారు.

2020 అక్టోబర్‌ 6న కమిటీ మళ్లీ సమావేశమైందని తెలిపారు. 2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామని, అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామన్నారు. గురువారం రాత్రి ఇచ్చిన గెజిట్ నోటికేషన్‌ ముందు ఎంతో చర్చించామని, సీడబ్ల్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశామని, ఏపీ పునర్ విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఉద్ఘాటించారు.

'ఏపీ, తెలంగాణ అవసరాలు, ప్రతిపాదనలు మేరకు నీటి విడుదల ఉంటుంది. ఇరురాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ అంశం చాలా సున్నితమైంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం తరలింపు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య, ఏకాభిప్రాయం తేవడమే అతిపెద్ద సవాలు. ట్రైబ్యునళ్ల పంపిణీ ప్రకారమే నీటి కేటాయింపులు ఉంటాయి. ఉమ్మడి ఏపీకి ఇప్పటికే నిర్దిష్టమైన కేటాయింపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేటాయింపులకు అనుగుణంగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ ఉంటుంది.'

-సంజయ్ అవస్థి​, జల్​శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి

ఇదీ చూడండి: 2020 అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే బోర్డులపై నోటిఫికేషన్‌ : కేంద్ర జల్‌శక్తి శాఖ

Last Updated : Jul 16, 2021, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details