ఉపాధి వేటలో అప్పులుచేసి మరీ గల్ఫ్‌బాట పట్టిన అభాగ్యులను కొవిడ్ పొట్టనపెట్టుకుంటోంది. వారి మృతదేహాలను ఏ దేశమూ సొంతూళ్లకు పంపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు కడసారిచూపునకూ నోచుకోవడం లేదు. ఫలితంగా.. కుటుంబసభ్యులకు తీరనిశోకమే మిగులుతోంది. ఉపాధి కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లినవారిలో ఇప్పటివరకూ సుమారు 50 మంది మరణించారు. కుటుంబపెద్దను కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ ఆ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆదుకునే దిక్కెవరు..?
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన మునిగంటి మల్లేశానికి(43) సొంతూళ్లో ఉపాధి కరవైంది. కుటుంబపోషణకు చేసిన అప్పులు తీర్చడానికి 12 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. అక్కడ కూలీ పనులు చేస్తున్న మల్లేశానికి కరోనా సోకడంతో గత ఏప్రిల్ 17న మృత్యువాతపడ్డాడు. మృతదేహం రాకపోవడంతో కుటుంబసభ్యులకు తమ కుటుంబపెద్ద ముఖాన్ని కడసారి చూసుకునే భాగ్యమూ దక్కలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు, తల్లి ఉన్నారు. ఇల్లు శిథిలావస్థకు చేరుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, రూ.10 లక్షల అప్పు ఎలా తీర్చాలని భార్య లక్ష్మి, తల్లి గంగు కన్నీటిపర్యంతమవుతున్నారు.
గుండెకోతే మిగిలింది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని అరుంధతీనగర్‌కు చెందిన గోసం గంధంబాబు(48)ది పేద కుటుంబం. కుటుంబపోషణ, అప్పులను తీర్చడానికి మూడేళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటున్న గంధంబాబుకు కొవిడ్ సోకడంతోపాటు గుండెపోటు రావడంతో గత ఏప్రిల్ 21న మరణించాడు. అతడి మృతితో భార్య రాజుభాయి, ఇద్దరు పిల్లలు, తల్లి పోసాని అనాథలయ్యారు. కుటుంబ పెద్దదిక్కు మరణించడంతో తమను ఆదుకునేదెవరు, రూ.5 లక్షల అప్పు తీరేదెలా అని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
గంధం బాబు.. ఆయన భార్యాపిల్లలు, తల్లి ఆ మౌనికది.. మౌనరోదనే!
నిర్మల్ జిల్లా కడెం మండలం ఎలగడపకు చెందిన భూక్యా తిరుపతి పెళ్లైన ఏడాదికే సింగపూర్‌కు పయనమయ్యాడు. అప్పటికే భార్య మౌనిక గర్భిణి. తిరుపతి సింగపూర్ వెళ్లిన 5 నెలలకు ఆడబిడ్డ జన్మించింది. ఊరికి వెళ్లి, కన్నకూతురిని ఎప్పుడు ముద్దాడుతానా అని ఆరాటపడేవాడు. ఇంతలోనే కరోనా ఆ చంటిబిడ్డకు తండ్రిని దూరం చేసింది. కన్నకూతురిని చూసుకోకుండానే తిరుపతిని కొవిడ్ బలితీసుకుంది. పెళ్లైన రెండేళ్లకే భర్త మరణించడాన్ని తట్టుకోలేక మౌనిక మౌనంగా రోదిస్తోంది. రూ.3 లక్షల అప్పులు తీర్చేదెలా, బిడ్డను పోషించేదెలా అని గుండెలు బాదుకుంటోంది.
మౌనిక-తిరుపతి దంపతుల పెళ్లి ఫొటో ఇదీచూడండి.. 'ప్రశ్నించే గొంతును అణచివేసేందుకే ప్రశ్నోత్తరాల రద్దు'