అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్పదని మరో మాట ఆలోచించకుండా చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో విపరీతమైన రక్తం కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి.. మానవత్వంతో మరో మనిషి దానం చేసిన రక్తమే అతని ప్రాణాల్ని కాపాడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కారణంగా దాతలు రక్తమివ్వడానికి ఆలోచిస్తున్నారు. ప్రజల్లో రక్తదానం పట్ల అపోహలు తొలగించి అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.ఓ) ఏటా జూన్ 14న అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌ఓ ‘గివ్ బ్లడ్ అండ్ కీప్ ది వరల్డ్ బీటింగ్’ నినాదంతో ప్రచారం చేపట్టింది. గ్రేటర్‌లో రక్తదానం చేస్తూ.. చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పిస్తూ ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో కొందరు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
రక్తదానం మహాదానం
మాది కరీనంగర్ జిల్లా భూపాలపట్నం గ్రామం. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. నా గ్రూపు బి-నెగెటివ్. 2013లో మొదటిసారి ఒకరికి నా రక్తం ఉపయోగపడింది. ఇప్పటి వరకూ 27సార్లు రక్తదానం చేశా. కరీంనగర్, హైదరాబాద్‌ల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. యువతలో అవగాహన కల్పించి ధైర్యాన్ని నింపుతున్నాం. మొదట్లో వద్దని వారించిన స్నేహితులు, బంధువులు కూడా ఇప్పుడు మేమున్నామంటూ చెబుతున్నారు. - నరేశ్ గొల్లపెల్లి, ఐటీ నిపుణుడు
ప్రాణం కాపాడే అవకాశం
2001లో రక్తదానం చేయటం మొదలైంది. నాది ‘ఏ పాజిటివ్’.. ఇప్పటి వరకూ 33 సార్లు రక్తం ఇచ్చాను. ప్లేట్‌లెట్స్ తరచూ ఇస్తుంటా. అత్యవసర సమయంలో సాటి మనిషిని కాపాడేందుకు మనకున్న అవకాశమిది. ఇన్నిసార్లు రక్తం ఇస్తే ఏదో అవుతుందనే ఆందోళన కనిపిస్తుంది. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ప్రతి 3 నెలలకోసారి రక్తం, నెలకోసారి ప్లేట్‌లెట్స్ ఇవ్వవచ్ఛు మనవాళ్లకు అవసరమైనపుడు రక్తదాతల కోసం వెతికి.. అవతలి వారికి అవసరమైనపుడు తప్పించుకోవటం మంచిది కాదు. నన్ను చూసి చాలామంది ముందుకు వస్తున్నారు. - అంజపల్లి నాగమల్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
ఆడవాళ్లు ధైర్యంగా ఇవ్వొచ్చు