తెలంగాణ

telangana

ETV Bharat / state

స్కాన్‌ చేసి.. పన్ను చెల్లించవచ్చు.. ప్రైవేటు సంస్థలతో బల్దియా ఒప్పందం - తెలంగాణ వార్తలు

GHMC about Property tax payment : ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు బల్దియా కృషి చేస్తోంది. క్యూఆర్ కోడ్​లతో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ చెల్లింపుల్లో భాగంగా, సిబ్బంది వద్దనున్న చేతి యంత్రాల్లో ఇంటి నంబరు నమోదు చేయగానే చెల్లించాల్సిన పన్ను విలువతో క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. ఇక స్కాన్‌ చేసి కట్టేయొచ్చు.

GHMC about Property tax payment, DIGITAL PAYMENT
స్కాన్‌ చేసి.. పన్ను చెల్లించవచ్చు.. ప్రైవేటు సంస్థలతో బల్దియా ఒప్పందం

By

Published : Feb 20, 2022, 1:23 PM IST

GHMC about Property tax payment : ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌పే, పేటీఎం, ఇతరత్రా మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా, యూపీఐ ఖాతా సంఖ్య, క్యూఆర్‌ కోడ్‌లతో చెల్లించే సదుపాయాన్ని ఐటీ విభాగం అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఆస్తిపన్ను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌, మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, సిబ్బంది ద్వారా, పౌర సేవా కేంద్రాల్లో చెల్లింపునకు అవకాశం ఉంది. బల్దియా వెబ్‌సైట్‌లో పీటీఐఎన్‌ నంబరును పొందుపరిచి యూపీఐ ఖాతా సంఖ్యతో, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో, క్యూఆర్‌ కోడ్‌తో పన్ను కట్టే సదుపాయం తాజాగా అందుబాటులోకి వచ్చింది. మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌తోనూ కట్టొచ్చు. బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లకు నగదు/చెక్కు/కార్డులు ఇస్తే.. వాళ్లు చేతి యంత్రంలో వివరాలు నమోదు చేసి రసీదు ఇస్తున్నారు. పౌర సేవా కేంద్రాల్లోనూ అంతే. డిజిటల్‌ చెల్లింపుల్లో భాగంగా, సిబ్బంది వద్దనున్న చేతి యంత్రాల్లో ఇంటి నంబరు నమోదు చేయగానే చెల్లించాల్సిన పన్ను విలువతో క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది. స్కాన్‌ చేసి కట్టేయొచ్చు. ఫోన్‌పే, పేటీఎం, ఇతర మొబైల్‌ అప్లికేషన్లలో ‘మున్సిపల్‌ ట్యాక్స్‌’ లింకు తెరిచి, ఆస్తిపన్ను ఖాతా సంఖ్య ద్వారా చెల్లించొచ్చని అధికారులు తెలిపారు. నెల రోజుల్లో సేవలు మొదలవుతాయన్నారు. ఈ ప్రక్రియను ఆరు భాషల్లో అందుబాటులో ఉంచారు.
పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులు
డిజిటల్‌ చెల్లింపులు ఏటా రెట్టింపవుతున్నాయి. ఏడాదికి రూ.1500 కోట్లకు పైగా వసూలవుతుంటే.. దాదాపు సగం నిధులు డిజిటల్‌ చెల్లింపుల ద్వారానే సమకూరుతుండడం విశేషం. ఇటీవల పలు బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. కొందరు బకాయిదారులు.. పాత బ్యాంకులకు చెందిన చెక్కులతో పన్ను చెల్లిస్తున్నారు. అవి చెల్లకపోవడంతో కేంద్ర కార్యాలయం క్షేత్రస్థాయి సిబ్బందికి చెక్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

ఆస్తిపన్ను పరిధిలోని నిర్మాణాలు: 17.5 లక్షలు
ఏటా వసూలయ్యే పన్ను: రూ.1850 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం: రూ.1212 కోట్లు

ఇదీ చదవండి:CM KCR Flex in Mumbai : ముంబయిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీల జోరు.. ఫొటోలు వైరల్

ABOUT THE AUTHOR

...view details