గ్రేటర్ హైదరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వాక్సిన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, స్ట్రీట్ వెండర్స్ విభాగంలో వార్తాపత్రికల పేపర్ బాయ్స్‌కు కూడా వాక్సిన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఒక్కరోజులోనే జీహెచ్ఎంసీ పరిధిలో 37 వేల 269 మందికి వాక్సిన్ ఇచ్చారు. ప్రతి రోజూ ముందుగా యాప్ ద్వారా సేకరించిన గ్రూపులకు చెందిన వారికి వాక్సిన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
GHMC Vaccination: గ్రేటర్లో సూపర్ స్ప్రెడర్లకు శరవేగంగా వ్యాక్సినేషన్ - సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్
జీహెచ్ఎంసీలో సూపర్ స్ప్రెడర్లకు టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా రెండో దశ విజృంభణతో ప్రజలు సైతం వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే 37 వేల 269 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.
ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 3లక్షల 60 వేల 535 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు వాక్సిన్ కేంద్రాలకు వెళ్లి ప్రక్రియను పరిశీలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రారంభించిన ప్రత్యేక అన్నపూర్ణ ఉచిత భోజనాల పంపిణీలో భాగంగా ఈరోజు 76 వేల 210 మందికి అందజేశారు. గ్రేటర్లో ఇప్పటి వరకు మొత్తం కోటి 8 లక్షల 28 వేల 860 మందికి ఉచిత భోజనాలు అందించారు. కరోనా నివారణలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో నేడు 1360 బృందాలతో 78 వేల 447 ఇళ్లలో సర్వే నిర్వహించారు. ఆసుపత్రుల్లో 17364 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు.