తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా? - ముంపు ప్రాంతాల్లో ఇళ్లపై జీహెచ్​ఎంసీ సర్వే

రోజుల తరబడి ముంపులో చిక్కుకున్న ఇళ్లు భద్రమేనా? వరద ధాటికి పునాదులు కొట్టుకుపోయిన భవనాల పరిస్థితేంటి? ప్రవాహ ఉద్ధృతికి దెబ్బతిన్న గోడలు, బీటలు వారిన పిల్లర్లతో ప్రమాదమా? గోడలతో నిర్మాణమైన ఇళ్లు పదిలమేనా? పిల్లర్లతో కట్టిన అంతస్తులు సురక్షితంగా ఉన్నాయా? పాతకాలం ఇళ్లు మరికొంత కాలం నిలుస్తాయా? వంటి ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీ సమాధానాలు సిద్ధం చేస్తోంది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో నగరవ్యాప్తంగా బాధిత ప్రాంతాల్లోని భవన నిర్మాణాల పటిష్ఠతపై అధ్యయనం ప్రారంభించింది.

GHMC survey on whether houses in flood-hit areas of Hyderabad are safe
వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా?

By

Published : Oct 25, 2020, 4:55 PM IST


మల్కాజిగిరి బండచెరువు ముంపు కాలనీల్లో ఇళ్లను పరిశీలిస్తున్న నిపుణులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోజుల తరబడి వరద నీటిలో నానుతున్న ఇళ్లు భద్రమేనా అంటూ ప్రజల్లో రేకెత్తుతున్న అనేక ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ ఆదేశాలమేరకు జీహెచ్​ఎంసీ సర్వే చేపట్టింది. ఇంటి యజమానులకు మూడు రకాల సిఫార్సులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎంప్యానల్డ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీర్లతో కూడిన ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో కలిసి టోలీచౌకీలోని నదీంకాలనీ, చార్మినార్‌జోన్‌లోని హఫీజ్‌బాబా నగర్‌, హయత్‌నగర్‌లోని బంజారాకాలనీ, మల్కాజిగిరి బండచెరువు దిగువ ప్రాంతాలను, సరూర్‌నగర్‌ చెరువు బాధిత కాలనీలను శుక్రవారం సందర్శించాయి. అందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీ, ట్రిపుల్‌ఐటీ, జేఎన్‌టీయూ నిపుణులతో మరిన్ని బృందాలను రంగంలోకి దించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

ముంపులో లక్ష ఇళ్లు..

రాజేంద్రనగర్‌లోని పల్లెచెరువు, బార్కస్‌లోని గుర్రంచెరువులకు గండి పడింది. కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్‌సాగర్‌, నాగోల్‌లోని బండ్లగూడ చెరువు, ఉప్పల్‌లోని పెద్దచెరువు, చిన్నచెరువు, హయత్‌నగర్‌లోని కప్పలచెరువు, బాతులచెరువు, కుమ్మరచెరువు, టోలీచౌకీలోని శాతమ్‌చెరువు, ఎల్బీనగర్‌లోని బైరామల్‌గూడ చెరువు, సరూర్‌నగర్‌చెరువు, కుత్బుల్లాపూర్‌లోని పటేల్‌చెరువు, మెహబూబ్‌కుంట, ఊరకుంట, పెద్దచెరువు, లింగంచెరువు, చింతల్‌చెరువు, మల్కాజిగిరి బండచెరువు, అల్వాల్‌ పెద్దచెరువు, బోయినపల్లిలోని పలు తటాకాలు దిగువ ప్రాంతాలను ముంచెత్తాయి. మల్కాజిగిరి, నాగోల్‌, సరూర్‌నగర్‌, టోలీచౌకీ, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, వనస్థలిపురంలోని చెరువులు ఇప్పటికీ అలుగు పారుతున్నాయి. వరద ప్రవాహం ఉద్ధృతి కొంతమేరకు తగ్గినా కాలనీల్లో మోకాల్లోతున నీరు పారుతోంది. మొత్తంగా చెప్పాలంటే ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబరు 22 వరకు నగరవ్యాప్తంగా 5 వేల కాలనీలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయి. అందులో సగం కాలనీలు వారం నుంచి పది రోజులకుపైగా నీటిలో మగ్గాయి. పల్లెచెరువు, గుర్రంచెరువు ప్రభావంతో కాటేదాన్‌ సమీపంలోని అలీకాలనీలో మనిషికన్నా ఎక్కువ ఎత్తున నీరు ప్రవహించింది. ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, చత్రినాక వంటి వెయ్యికాలనీలను ఆ తటాకాలు ప్రభావితం చేశాయి. సరూర్‌నగర్‌ చెరువు దిగువనున్న కోదండరామ్‌కాలనీ, శారదనగర్‌, మల్కాజిగిరిలోని ఎన్‌ఎండీసీకాలనీ, సీఎన్‌బీకాలనీ, షిర్డిసాయినగర్‌, కుత్బుల్లాపూర్‌లోని ఉమామహేశ్వరకాలనీ, సుభాష్‌నగర్‌ వంటి ప్రాంతాలు పీకల్లోతు నీటిలో కూరుకుపోయాయి. సెల్లార్లు పూర్తిగా మునిగిపోవడం, వీధుల్లో ఐదు రోజులకన్నా ఎక్కువ సమయం నీటి ప్రవాహం ఉండటం, ఇతరత్రా పరిస్థితులను నగరవ్యాప్తంగా ఒక లక్ష భవన నిర్మాణాలు ఎదుర్కొని ఉండొచ్చని అధికారుల అంచనా.

ఇలా ఉంటే కూల్చేయాల్సిందే..

పునాది కొట్టుకుపోవడం, గోడలు పెద్దఎత్తున బీటలు వారడం, పిల్లర్లకు పగుళ్లు ఏర్పడి ఉంటే అలాంటి భవనాలను కూల్చేయాల్సిందేనని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

బేఫికర్‌

పునాదులు, గోడలు, స్లాబు ఏమాత్రం దెబ్బతినకపోతే వాటికి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదని, ధైర్యంగా వాటిని ఎప్పటిలాగే ఉపయోగించవచ్చని బల్దియా స్పష్టం చేస్తోంది.

మరమ్మతులు చేయాలి

పునాదికి నష్టం జరగకుండా, గోడలు స్వల్పంగా బీటలు వారిన సందర్భంలో, స్లాబు, గోడలు బాగా చెమ్మ పట్టడం జరిగి ఉంటే పకడ్బందీ మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది.

వారం నుంచి పది రోజులపాటు

* ముంపులోఉన్న కాలనీలు 4 -5వేలు

* వాటి పరిధిలోని భవన నిర్మాణాలు 80వేలు-1లక్ష

* కాలనీల్లోని జనాభా 3 - 5లక్షలు

ఇదీ చూడండి:ప్రవాహం ఆగలేదు.. పొయ్యి వెలగలేదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details