హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీహెచ్ఎస్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ దానకిశోర్‌తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 23 అంశాలను ఆమోదించారు.
తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఉత్తర-దక్షిణ పంపిణీ విభాగాలు పెంచిన వేతన సవరణలను జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న విద్యుత్ ఇంజనీర్లకు వర్తింపజేయాలనే తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన కరవు భత్యాన్ని జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వర్తించేయాలని ఆమోదించారు. ఎస్ఆర్డీపీ పనుల నిధుల సేకరణకు మూడో విడతలో రూ. 305 కోట్లను బాండ్ల రూపంలో జూన్ లేదా జులై మాసంలో సేకరించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.