హైదరాబాద్ నగరంలోని పలు సమస్యలపై ఆన్లైన్, మై-జీహెచ్ఎంసీ యాప్, కంట్రోల్ రూంలకు అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. నగరవాసులు తమకు సంబంధించిన సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావడానికి 8 రకాలైన విధానాలున్నాయని... మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్, జీహెచ్ఎంసీ కాల్ సెంటర్, డయల్ 100, ఎమర్జెన్సీ కాల్ సెంటర్, జీహెచ్ఎంసీ ట్విట్టర్, ప్రజావాణి, వార్త పత్రికల క్లిపింగ్‌లు, కమిషనర్ పేషీ ద్వారా ఫిర్యాదులు అందచేయవచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది.
నగరంలో కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా.. ప్రత్యేకంగా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసినట్లు బల్దియా పేర్కొంది. కాల్‌సెంటర్‌కు ఏప్రిల్ 1నుంచి 27 వరకు 563 ఫిర్యాదులు అందాయి. వీటిలో 133 కొవిడ్ కిట్లకు సంబంధించినవి కాగా... 292 కాల్స్ నగరంలో వాక్సినేషన్, కరోనా పరీక్ష కేంద్రాలకు సంబంధించినవి. 43 ఫోన్లు కొవిడ్ మృతుల దహనాలు గురించి, అంబులెన్స్ సేవలు తదితరవాటికోసం వచ్చాయి.