తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌కు పచ్చందాలు... 75 ప్రాంతాల్లో చిట్టడువులు - హైదరాబాద్ హరిత హారం వార్తలు

అద్దాల మేడలు.. ట్రాఫిక్‌ రణగొణ ధ్వనులు.. హైటెక్‌ సొబగులతో కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌ను ఇప్పుడు ‘హరిత’బాద్‌గా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రూపొందించింది. నగరవ్యాప్తంగా పచ్చందాలు పరిచేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా గ్రేటర్‌ పరిధిలో 75 ప్రాంతాల్లో యాదాద్రి నమూనా కింద చిట్టడవులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సహజ అడవుల పెంపకానికి కావాల్సిన వనరులను సమీకరించుకుంటోంది.

hyderabad
hyderabad

By

Published : Jun 29, 2020, 12:27 PM IST

హైదరాబాద్​ నగరంలో పచ్చదనం పరిచేందుకు జీహెచ్​ఎంసీ సన్నద్ధవుతోంది. యాదాద్రి నమానాలో మహానగరం పరిధిలో 75 ప్రాంతాల్లో చిట్టడువులను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఆరో విడత హరితహారంలో భాగంగా నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. దీంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. సహజ అడవుల పెంపకానికి కావాల్సిన వనరులను సమీకరించుకుంటోంది.

ప్రభుత్వ భూముల సేకరణ

హరితహారం సమీక్షలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు జోనల్‌ అధికారులు ఆరు జోన్లలో మొత్తం 65 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో దాదాపు ఎక్కువ శాతం బల్దియాకు చెందిన ఖాళీ స్థలాలతోపాటు పలు సంస్థలకు చెందిన భూములు ఉన్నాయి. మరో పది ప్రాంతాల కోసం ఇతర ప్రభుత్వ భూముల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

యాదాద్రి నమూనాలో ఏడాదిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో ఫలితాలు సాధించనున్నట్లు తెలిపారు. జులై నెలాఖరులోగా ఈ 75 ప్రాంతాల్లో చిట్టడవుల పెంపకానికి బీజం పడనున్నట్లు తెలిపారు.

ఏంటీ యాదాద్రి నమూనా..?

క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో మట్టిని ట్రీట్‌మెంట్‌ చేసి, వర్మీ కంపోస్ట్‌ వాడుతూ, ఆ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను నాటుతారు. దాదాపు అడుగుకో మొక్క చొప్పున ఎకరం భూమిలో సుమారు 4వేలకు పైగా వివిధ రకాల మొక్కలు నాటుతారు. పెరిగిన తర్వాత ఒకదానికి మరొకటి అడ్డు రాకుండా ఉండేందుకు వృక్ష జాతులు, వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా ఈ పనులు ఉంటాయి.

ఆ మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కొనసాగిస్తారు. దాదాపు రూ.3లక్షల ఖర్చుతో 45 రోజుల్లో ఒక ఎకరం భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్ఛు జపాన్‌ మియావాకీ పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి మోడల్‌గా అమలుచేస్తున్నారు. తక్కువ ప్రాంతంలో ఎక్కువ సాంద్రతతో సహజ సిద్ధమైన అడవిని పెంచడం దీని ప్రత్యేకత. తద్వారా అటు పచ్చదనం పెంపు, ఇటు స్వచ్చమైన ఆక్సిజన్‌ను పరిసర ప్రాంతాలకు అందించేందుకు ఈ కొత్త పద్ధతి దోహదపడుతుంది.

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభాలు..!

మారుతున్న పరిస్థితులు, అధిక మొత్తంలో వాహనాలు రోడ్డెక్కడం తదితర కారణాలతో నగరంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. దీనిని నియంత్రించే స్థాయిలో పచ్చదనం కరవైంది. ఇప్పుడు దాన్ని సాధించడంతోపాటు పర్యావరణ సమతుల్యత వైపు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనాలిచ్చే యాదాద్రి మోడల్‌ని నగరవ్యాప్తంగా అమలు చేయనుంది.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ABOUT THE AUTHOR

...view details