GHMC Officials Focus on Ganesh Idols Immersion Places : వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు(GHMC Officials) నిమజ్జన కేంద్రాలపై దృష్టి పెంచారు. జోన్లు, సర్కిళ్ల పరిధిలో ఎక్కడెక్కడ నిమజ్జనాలు చేపట్టాలనే అంశంపై స్పష్టత వచ్చినా.. ప్రధానమైన హుస్సేన్‌సాగర్ విషయంలో అయోమయం ఇంకా వీడట్లేదు. ఇక్కడ ఏటా 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం(Ganesh idols Immersion) జరుగుతుండగా.. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ మధ్య సయోధ్య కుదరట్లేదనే విమర్శలు వస్తున్నాాయి.
GHMC on Ganesh Idols Immersion Centres : గతేడాది ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్డులో చేపట్టిన సుందరీకరణ పనులు దెబ్బతింటాయని హెచ్‌ఎండీఏ అధికారులు(HMDA Officials) ఆందోళన వ్యక్తం చేయగా.. ఇప్పుడు పీపుల్స్ ప్లాజావద్ద సాగర్‌లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ ఫౌంటెయిన్(Floating Fountain) దెబ్బతింటుందని చెబుతున్నారు. పీపుల్స్ ప్లాజావద్ద ఎనిమిది నుంచి పది క్రేన్లు ఏర్పాటుచేసి నిమజ్జనాలను వేగంగా పూర్తి చేయొచ్చని.. జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు అభిప్రాయపడుతుండగా, జలవిహార్ పక్కన అదే మాదిరి ఏర్పాట్లు చేసుకోవచ్చని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. కొత్త ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కష్టమని పోలీసులు చెబుతున్నారు. నిమజ్జనం వేగంగా పూర్తవకపోతే రహదారులపై ట్రాఫిక్ సమస్య, తర్వాత వచ్చే మరో పండుగకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అంటున్నారు.
జోన్లలో చురుగ్గా.. :అయితేజోన్లలోని పలు చెరువులు, మైదానాల్లో నిమజ్జన ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. మైదానాలు, ఖాళీ స్థలాల్లో 22 చోట్ల నాలుగు నుంచి ఆరడుగుల లోతు గుంతలు(Excavation) తవ్వి, అందులో నీరు నింపి విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు అధికారులు అంటున్నారు. మరో 24 చోట్ల ప్లాస్టిక్ ట్యాంకులను నిమజ్జనానికి సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో నిర్మించిన 28 నిమజ్జన కోనేరులను సైతం శుభ్రం చేస్తున్నామన్నామని.. వాటిలోని వ్యర్థాలు తొలగించి మంచి నీటితో నింపుతున్నట్లు యంత్రాంగం పేర్కొంది.
HMDA on Ganesh Immersion Sites :వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను నెక్లెస్‌రోడ్డులో నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand), బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, హెచ్‌ఎండీఏ అధికారులు.. పీపుల్స్ ప్లాజా, జలవిహార్, వాహనాల పార్కింగ్(Vehicle Parking) బ్రిడ్జి వద్ద పరిశీలించారు. కొత్తగా ఆ ప్రదేశంలో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం అధికారులు ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం(Khairatabad Ganesh Idol Immersion) చేసే ప్లాట్‌ఫారాన్ని కూడా సందర్శించారు. గతంలో ఒక క్రేన్ ఏర్పాటు చేసేలా ఉన్న ప్లాట్‌పారంను ఇప్పుడు వెడల్పు చేశారు. అక్కడ 3 క్రేన్లు పెట్టొచ్చని నిర్వాహకులు సూచించడంతో మొదటి రోజు నుంచే అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు, అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్‌మాన్, ఈఎన్సీ జియావుద్దీన్, జడ్పీ వెంకటేశ్ దోత్రె, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్‌ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అదనపు కమిషనర్ ఉపేంద్రరెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు సీపీలు ఇందులో పాల్గొన్నారు.