గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. ఇటీవల వరకూ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో మాత్రమే వైరస్ వ్యాపించేది. ప్రస్తుతం కుటుంబాలకూ పాకింది. ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో అగ్రభాగం హైదరాబాద్కు చెందినవే ఉంటున్నాయి. కొత్తగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల్లో కుటుంబ సభ్యులందరూ బాధితులు అవుతున్నారు. నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావటంతో వ్యాపారవర్గాలు ఉలిక్కిపడ్డాయి. గ్రేటర్లో కేసులు పెరుగుతుండడం వల్ల జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న కేసులు... అధికారులు అప్రమత్తం - greater hyderabad
భాగ్యనగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండడం వల్ల జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం కంటైన్మెంట్ జోన్లపై దృష్టి సారించారు. ఆ ప్రాంతాల్లో రోజుకు రెండు సార్లు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.
కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఇంకా కేసులు పెరగకుండా ఉండేందుకు పోలీసు అధికారులు కూడా లాక్డౌన్ను పూర్తిస్తాయిలో అమలు చేస్తున్నారు. కేసులు ఉన్న ప్రాంతాల్లో రోజుకు రెండు సార్లు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఉదయం, సాయంత్రం కంటైన్మెంట్ జోన్లల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. హైదరాబాద్లో ఎలాంటి సడలింపులు ఇవ్వనప్పటికీ కొద్ది మంది ఉద్యోగులతో పలు ప్రైవేటు కార్యాలయాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో గతంతో పోల్చితే రోడ్లపై రద్దీ కూడా పెరుగుతోంది.
ఇవీ చూడండి: నిబంధనలు పాటించని వారిపై పోలీసుల కొరడా