ప్రస్తుతం నగరంలోని ఏ ప్రధాన ప్రాంతంలో చూసినా హారన్లు కొడుతూ దూసుకొచ్చే వాహనాలు, ట్రాఫిక్ స్తంభించడాలు కనిపిస్తుంటాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాక కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక రోడ్లు దాటేందుకు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కట్టడి విధులు నిర్వహిస్తూనే పాదచారుల సాఫీ ప్రయాణానికి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులు సిద్ధమయ్యారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో 100 చోట్ల పెలికాన్ సిగ్నళ్లను ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి రెండు, మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రెండో స్థానంలో..
హైదరాబాద్ నగరం, సైబరాబాద్ పరిధుల్లో రోజూ సగటున 8 లక్షల మంది పాదచారులు రోడ్లు దాటుతున్నారు. దాటేందుకు కూడళ్ల వద్దే అనువైన పరిస్థితులున్నాయి. విద్యాసంస్థలు, ఆసుపత్రులున్న చోట్ల రోడ్డు దాటాలంటే దడే. పంజాగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అధికంగా పాదచారులే గాయపడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల్లో క్షతగాత్రులు, చనిపోతున్న వారిలోనూ పాదచారులదే రెండో స్థానం.