గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన తుది ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన 150 మంది కార్పొరేటర్ల జాబితాను ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించారు. దీంతో తదుపరి ప్రక్రియను ఎస్ఈసీ ప్రారభించింది. ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. బల్దియా ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల పదో తేదీతో ముగియనుంది. ఆ తేదీకి 30 రోజుల ముందుగా అంటే ఈ నెల పదో తేదీ తర్వాత గెజిట్ ఇస్తారు.
సంక్రాంతి తర్వాత
సంక్రాంతి సెలవుల దృష్ట్యా ఈ నెల 15వ తేదీ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు సంబంధిత ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. కొత్త పాలకమండలి మొదటి సమావేశ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. నూతన పాలకమండలిని సమావేశపరిచేందుకు నోటిఫికేషన్ జారీ చేసి... మేయర్ ఎన్నిక కోసం కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నిక చేపడతారు. మేయర్ ఎన్నిక కోసం ఎన్నికైన, ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది కోరం తప్పనిసరి. సరిపడా కోరం ఉంటే చేతులెత్తే విధానంలో మేయర్ ఎన్నిక చేపట్టి ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.